అశ్వారావుపేట బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
అశ్వారావుపేట :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం పార్టీ శ్రేణుల ఉత్సాహ నినాదాలతో సందడిగా సాగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు తన్నీరు హరీష్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల్లో ఒక్కటీ సక్రమంగా అమలు కాలేదని ఆరోపించారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో విఫలమైందని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ యూరియా కొరత తీవ్రంగా ఉందని అన్నారు. అలాగే రైతులకు అవసరమైన విద్యుత్ సరఫరా కూడా సక్రమంగా అందడం లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని రవిచంద్ర పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసిన తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిరిగి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టడం ఖాయమని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక సీట్లలో పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం తథ్యమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు, పార్టీ నాయకులు లింగాల కమల్‌రాజ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఉప్పల వెంకటరమణ, దిండిగల రాజేందర్, ఏనుగుల రాకేష్‌రెడ్డి, మానే రామకృష్ణ, రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ కండువాలు ధరించి సమావేశానికి హాజరై పార్టీ ఐక్యతను చాటారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.