ఇంటర్ కళాశాలల్లో ఫీజుల దోపిడీ, రిజర్వేషన్ల ఉల్లంఘనపై ఫిర్యాదు

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలు, ఇష్టానుసార ఫీజుల వసూళ్లు, రిజర్వేషన్ల అమలులో లోపాలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలిని కోరారు. శుక్రవారం నాంపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ ఎంబీసీ చైర్మన్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పల్ నియోజకవర్గంలోని పలువురు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఒకే తరగతిలో చదువుతున్న విద్యార్థుల నుంచి భిన్న భిన్నంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు నిర్మాణాన్ని పక్కనపెట్టి తమ ఇష్టానుసారం ఫీజులు వసూలు చేయడం విద్యా నిబంధనలకు విరుద్ధమని అన్నారు. విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థులను వేలంపాట వస్తువుల్లా చూడటం సిగ్గుచేటని విమర్శించారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్ ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉన్నప్పటికీ అనేక ప్రైవేటు కళాశాలలు వాటిని విస్మరిస్తున్నాయని ఆరోపించారు. పేద, మధ్యతరగతి, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు రాజ్యాంగబద్ధంగా లభించాల్సిన అవకాశాలు దూరమవుతున్నాయని అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ధర్మారెడ్డి, తినలేరు హనుమంతరావు, వై. సత్యనారాయణరావు, ఎనుముల మహేష్ కుమార్, మారినేని ఫణీంద్ర, తీగ విట్టల్ రావు, బేకరీ రవీందర్ రెడ్డి, కాటేపల్లి రవీందర్ రెడ్డి, గడ్డం సాయికిరణ్, గూడూరు శైలేష్ రెడ్డి, సీతారాం రెడ్డి, సందీప్ యాదవ్, విజయ్ కుమార్, యాదగిరి చారి, మాధవ్, శ్రీనివాసరావు, మురళి తదితరులు పాల్గొన్నారు.