యథావిధిగా సింగరేణి మెడికల్ బోర్డు

Facebook
X
LinkedIn

మెడికల్ బోర్డును అత్యంత పారదర్శకంగా, వివాదరహితంగా నిర్వహించాలి

అర్హులైన ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలు అందేలా చర్యలు చేపట్టాలి

సింగరేణి యాజమాన్యానికి ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి
భట్టి విక్రమార్క మల్లు ఆదేశం

హైదరాబాద్, :

సింగరేణి కార్మికులకు శుభవార్త. సింగరేణిలో వివిధ కారణాలతో కొద్ది కాలంగా నిలిచిపోయిన మెడికల్ బోర్డును అతి త్వరలో ప్రారంభించాల్సిందిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ బోర్డు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా, వివాదరహితంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు.

సింగరేణి అభివృద్ధిపై ఇటీవల కోల్ బెల్ట్ ప్రాంత శాసన సభ్యులు, మంత్రులతో నిర్వహించిన సమావేశం సందర్భంగా మెడికల్ బోర్డు అంశాన్ని వారు తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ అంశంపై కార్మికుల ఆందోళనలను వివరించారని చెప్పారు. ఆ సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి, కార్మికుల ప్రయోజనాలను కాపాడే దిశగా చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

మెడికల్ బోర్డు ప్రక్రియ ద్వారా నిజంగా అర్హులైన ఉద్యోగులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా వారి వారసులకు కారుణ్య నియామకాల రూపంలో ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు, మధ్యవర్తిత్వం లేదా మోసాలకు తావులేకుండా కట్టుదిట్టమైన వ్యవస్థను అమలు చేయాలని స్పష్టం చేశారు.

కార్మికుల సంక్షేమం విషయంలో ప్రజా ప్రభుత్వం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, మెడికల్ బోర్డు ప్రక్రియపై పూర్తి విశ్వాసం ఉంచి యాజమాన్యానికి సహకరించాలని కార్మికులకు సూచించారు.

ఇటీవల కాలం వరకు కారుణ్య నియామకాలు, డిపెండెంట్ ఉద్యోగాలకు అర్హత సాధించిన 335 మంది వారసులకు మంచిర్యాలలో శనివారం (ఈ నెల 13వ తేదీ)
జరిగే కార్యక్రమంలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు తెలియజేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.