మచిలీపట్నం:
జిల్లా అభివృద్ధి, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పేర్కొన్నారు.
రాష్ట్ర మంత్రి, జిల్లా కలెక్టర్ ను ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు జయన్, యాదవ్ శనివారం మధ్యాహ్నం మచిలీపట్నం నగరంలోని రహదారులు భవనాల శాఖ అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల్లో తాగునీటి సౌకర్యాల కల్పన, మహిళా సాధికారత, బీచ్ ప్రాంతాల్లో పచ్చదనం పెంపొందించడం, యువతకు ఉపాధి కల్పన శిక్షణలు, సివిల్ సర్వీసెస్ ఆశావహులకు ఉచిత శిక్షణ వంటి అంశాలపై మంత్రి, జిల్లా కలెక్టర్‌తో సంస్థ ప్రతినిధులు విస్తృతంగా చర్చించారు.
తీర ప్రాంత గ్రామాల్లో స్వచ్ఛమైన తాగునీటిని అందించే దిశగా పైలెట్ ప్రాజెక్టుగా మచిలీపట్నం మండలంలోని పెదపట్నం, పల్లెతుమ్మలపాలెం గ్రామాలను ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆయా గ్రామాల్లో చెరువు నీటిని శుద్ధి చేసే ప్రత్యేక ప్యూరిఫికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసి, శుద్ధి చేసిన నీటిని పైప్‌లైన్ల ద్వారా ప్రతి ఇంటికి నేరుగా సరఫరా చేసే విధంగా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. పైలెట్ ప్రాజెక్టు అమలు ద్వారా లభించే అనుభవాల ఆధారంగా తీర ప్రాంతంలోని ఇతర గ్రామాలకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు.
ఈ ప్రతిపాదనపై మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తరఫున అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ముందుకు వచ్చిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులను వారు ప్రత్యేకంగా అభినందించారు.
అదేవిధంగా మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ మహిళలకు మిషన్ కుట్టు, అల్లికలు, ఎండు చేపలు రొయ్యల వ్యాపార నిర్వహణపై శిక్షణ అందించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. అలాగే ప్రతి ఏడాది 20 మంది సివిల్ సర్వీసెస్ ఆశావహులకు ఉచిత శిక్షణ అందించి యువతకు ప్రోత్సాహం కల్పించనున్నట్లు వెల్లడించారు.
అంతకుముందు సంస్థ ప్రతినిధులు మచిలీపట్నం మండలంలోని పెదపట్నం గ్రామాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి తుపాను షెల్టర్ వద్ద ఓవర్ హెడ్ ట్యాంకు, గ్రామంలో నీటి సరఫరా స్థితిగతులను తెలుసుకున్నారు.
గ్రామీణ నీటి సరఫరా విభాగం డిఈ సుధాకర్, ఏఈ సుగుణ, డి ఆర్ డి ఎ విభాగం అధికారులు ఈ చర్చలో పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.