ఏడాదిలోపు వైద్య మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు పూర్తి చేయాలి

Facebook
X
LinkedIn

అధికారులకు మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశం

హైదరాబాద్ :

రాష్ట్రంలోని వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయంలో తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా క్యూర్ (CURE) ప్రాంతంలో సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ఏర్పాటుపై మంత్రి సమీక్షించారు. ఇప్పటికే 70 శాతం నిర్మాణం పూర్తయిన టీచింగ్ ఆసుపత్రుల్లో అవసరమైన వైద్య పరికరాల ఏర్పాటును తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో కొనసాగుతున్న నిర్మాణ పనులన్నింటినీ ఏడాది లోపు పూర్తి చేయాలని సూచించారు.

టీవీవీపీ ఆసుపత్రుల్లో చేపట్టిన మైనర్, మేజర్ సివిల్ వర్క్స్‌ను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో నిర్మాణంలో ఉన్న టీచింగ్ ఆసుపత్రుల పురోగతిని సమీక్షిస్తూ పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

మూడో విడతలో మంజూరైన టీచింగ్ ఆసుపత్రుల నిర్మాణాలు, భూసేకరణ అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. నర్సింగ్ కళాశాలలు, హాస్టళ్లు, టీచింగ్ హాస్పిటళ్లు, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రులు, మాతా-శిశు సంరక్షణ కేంద్రాలు, క్రిటికల్ కేర్ బ్లాక్స్ నిర్మాణాల పురోగతిని మంత్రి సమీక్షించారు.

అలాగే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల బ్రాండింగ్, ఆసుపత్రుల ఉన్నతీకరణ కార్యక్రమాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) నిర్మాణాలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి సమర్పించాలని వైద్య, ఇంజినీరింగ్ శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.

సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ సీఎండీ గౌరవ్ ఉప్పల్, చీఫ్ ఇంజనీర్ శశిధర్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.