హైదరాబాద్ :
ఉదయం నిద్ర లేచిన వెంటనే కీళ్లలో గట్టితనంగా (స్టిఫ్నెస్) అనిపించడం చాలా మందికి జరుగుతూ ఉంటుంది. అందరికీ ఇది సాధారణ సమస్యగా కనిపించవచ్చు. అయితే కీళ్లల్లో గట్టితనంగా అనిపించడం వెనుక కారణాలు ఉంటాయని ఈ కారణాలు ఏమిటో తెలుసుకోవడం చాలా అవసరమని వైద్యులు చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం, 45 సంవత్సరాల పైబడిన వారిలో సుమారు 47% మంది కీళ్ల నొప్పి, 31% మంది వెన్నునొప్పి, 20% మంది కాళ్ల కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. దీని ద్వారా కీళ్ల సమస్యలు ఎంత విస్తృతంగా ఉన్నాయో అర్థమవుతోంది. నిద్ర సమయంలో శరీరం ఎక్కువసేపు కదలిక లేకుండా ఉండటం వల్ల కండరాలు గట్టిపడటం సహజం. అందువల్ల ఉదయం కొద్దిసేపు కీళ్లలో గట్టితనం అనిపించవచ్చు. అయితే ఈ గట్టితనం ఎంతసేపు కొనసాగుతుందన్నది ముఖ్యమైన విషయం. ఎక్కువసేపు కొనసాగితే అది సాధారణం కాదని, ఆస్టియో ఆర్థ్రైటిస్ వంటి సమస్యలకు సంకేతంగా ఉండవచ్చునని వైద్యులు తెలియజేస్తున్నారు.
కారణాలు ఇవే..
ఆస్టియో ఆర్థ్రైటిస్ అనేది కీళ్ల మధ్య ఉండే కార్టిలేజ్ (మృదువైన పొర) క్రమంగా దెబ్బతినడం వల్ల ఏర్పడే సమస్య. కార్టిలేజ్ తగ్గిపోతే ఎముకలు ఒకదానికొకటి రుద్దుకుని నొప్పి కలిగిస్తాయి. ముఖ్యంగా 45-50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళల్లో, ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. కార్టిలేజ్ దెబ్బతినడం కీళ్లు సజావుగా పనిచేయడాన్ని అడ్డుకుంటుంది. దీనివల్ల కీళ్లలో గట్టితనం ఏర్పడుతుంది. కీళ్లలో ఇన్ల్ఫమేషన్ పెరగడం కూడా గట్టితనానికి కారణమవుతుంది. ఇది వ్యాధి తీవ్రతను పెంచుతుంది. జాయింట్లలో ఉండే లూబ్రికేషన్ తగ్గిపోవడం వల్ల కదలిక సరిగా ఉండదు. ఇది షాక్ అబ్సార్బర్లా పనిచేసే ద్రవం తగ్గిపోవడం వల్ల జరుగుతుంది. ఎముకల్లో మార్పులు, బోన్ స్పర్స్ ఏర్పడటం వల్ల కీళ్ల కదలిక కష్టమవుతుంది. వయస్సు పెరగడం, ముఖ్యంగా మెనోపాజ్ సమయంలో ఎముకల బలహీనత వల్ల కూడా కీళ్ల సమస్యలు వస్తాయి. వీటితో పాటు కీళ్లల్లో గట్టితనానికి ఇతర కారణాలు కూడా ఉండవచ్చునని వైద్యులు చెబుతున్నారు.
లక్షణాలు తీవ్రం అయితే జాగ్రత్త పడాల్సిందే..
రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి కీళ్ల నొప్పి, వాపు, గట్టితనానికి కారణమవుతుంది. ఫైబ్రోమయాల్జియా అనే దీర్ఘకాలిక సమస్య వల్ల నొప్పి, అలసట ఎక్కువగా ఉంటాయి. విటమిన్ D లోపం కూడా కీళ్ల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. తప్పు భంగిమ (పోష్చర్) లేదా ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కండరాలు కుదించి ఉదయం గట్టితనం పెరుగుతుంది. ఇక ఉదయం ఈ గట్టితనం 30 నిమిషాలకంటే ఎక్కువసేపు కొనసాగితే, కీళ్లలో వాపు, ఎర్రబడటం, వేడి అనిపించినా, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బంది కలిగినా, అకస్మాత్తుగా లక్షణాలు తీవ్రతరం అయినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సరైన నిర్ధారణ కోసం వైద్యులు క్లినికల్ పరీక్షలు, స్కానింగ్ వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. వ్యాయామం, బరువు నియంత్రణ వంటి జీవనశైలి మార్పులు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. పెయిన్ మేనేజ్మెంట్ విధానాలు, ఫిజియోథెరపీ, అవసరమైన మందులు ఉపయోగపడతాయి. ఉదయం కీళ్ల గట్టితనం తరచుగా అనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. కారణం తెలియకపోయినా, సమస్య కొనసాగితే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. ముందుగానే గుర్తిస్తే ఆస్టియో ఆర్థ్రైటిస్ వంటి సమస్యలను నియంత్రించుకోవచ్చునని వైద్యులు తెలియజేస్తున్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.