అత్యంత వైభవంగా మేడారం మహాజాతర ప్రారంభం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

ప్రతి రెండేళ్లకోసారి నాలుగు రోజులపాటు అత్యంత వైభవంగా జరిగే మేడారం మహాజాతర సంబురానికి సర్వం సిద్ధమైంది. మహాజాతర కోసం మేడారం ప్రాంగణమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నేటినుంచి నాలుగు రోజులపాటు మేడారంలో మహాజాతర జరగనున్నది. జాతర తొలిఘట్టంలో భాగంగా బుధవారం సాయంత్రం కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెపైకి తీసుకువచ్చారు. ఇప్పటికే కొత్తగూడ మండలం పూనుగుండ్ల నుంచి బయలుదేరిన పగిడిద్దరాజు, ఏటూరునాగరం మండలం కొం డాయి నుంచి బయలుదేరిన గోవిందరాజులు కూడా బుధవారమే చేరుకుంటారు. ఇక్కడినుంచి మొదలయ్యే మహాజాతరలో ఈనెల 29న రెండవరోజైన గురువారం సాయంత్రం మహాఘట్టానికి తెర లేవనున్నది. ఈనెల 30వ తేదీన తల్లులు ఇద్దరు కూడా గద్దెలపై కొలువై ఉండడంతో భక్తజనం తమ మొక్కులను చెల్లించుకుంటారు. నాలుగవ రోజైన శనివారం సాయంత్రం దేవతలు వారివారి ప్రాంతాలకు తిరుగుముఖం పట్టడంతో జాతర ముగుస్తుంది.కొత్తగా…సరికొత్తగా…మంత్రి సీతక్క చొర వ..సీఎం నిధులుఈసారి మహాజాతర కొత్తగా, సరికొత్తగా భక్తులకు కనువిందు చేస్తున్నది. శాశ్వత నిర్మాణాల పేరిట ఆధునీకరించడంతో మేడారం ధగధగలాడుతున్నది.

 ఈసారి మేడారం జాతర కోసం మంత్రి సీతక్క చొరవతో సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు. సుమారు 150 కోట్లతో పనులు చేపట్టడంతో మేడారం కొత్త శోభను సంతరించుకున్నది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా మేడారంలోనే కేబినెట్ సమావేశం నిర్వహించడం, కొత్తగా పనులు చేపట్టడంతో జాతరపై భక్తుల్లో ఆసక్తి, అంచనాలు పెరిగిపోయాయి. 1944 నుంచి ప్రభుత్వం జాతరను నిర్వహిస్తున్నా, 1967లో దేవాదాయ శాఖ తన ఆధీనంలోకి తీసుకున్నది. 1998లో మేడారం జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. అప్పటినుంచి భక్తులు భారీగా పెరగడంతో జాతీయ పండుగగా గుర్తించాలని డిమాండ్ పెరిగింది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు 150 కోట్లు కేటాయించి జాతరను ఆధునీకరించడంతో మైలురాయిగా నిలవనున్నది. మంత్రి సీతక్క జాతరలోనే తిష్ట వేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. మహాజాతరకు తరలివచ్చే కోట్లాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాతరను 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించింది. వివిధ శాఖలకు చెందిన 42 వేల 27 మంది ఉద్యోగులను జాతర విధులకు నియమించింది. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూసేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఎఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు.జాతరలో తప్పిపోతున్న భక్తులను సులువుగా గుర్తించేందుకు వీలుగా ఈసారి జియోట్యాగ్ బెస్ట్ మిస్సింగ్ పర్సన్ ట్రాకింగ్ సిస్టమ్ ను తీసుకువచ్చారు. అలాగే పాత నేరస్థులను గుర్తించేందుకు ఆసుపత్రి ఏరియా, పార్కింగ్ ప్రాంతాల్లో ఫేస్ రికగ్నైజింగ్ కోసం టెక్నాలజీ వినియోగిస్తున్నారు. అనుమానితులను గుర్తించేందుకు వీలుగా రియల్ టైమ్ అలెర్ట్ సిస్టమ్ సిద్ధం చేశారు. ఇదేకాకుండా జాతరలో 450 సీసీ కెమెరాలు, 20 డిస్ ప్లే ప్యానెల్స్, క్లౌడ్ కౌంటింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు. జాతరకు వెళ్ళే దారిలో ప్రతి నాలుగు కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఔట్ పోస్ట్ ఏర్పాటుచేశారు. వీటితో పాటుగా మొబైల్ పెట్రోలింగ్ టీమ్ లు, మఫ్టీ టీమ్ లు ఉన్నాయి. జాతరలో విధుల నిర్వహణకు 13వేల మందిని కేటాయించారు. ఉమ్మడి జిల్లాలోని ఎస్పీ, డీసీపీ, ఎసిపిలకు కూడా డ్యూటీలు వేశారు.ఆర్టీసీ ప్రాంగణం దాకా వచ్చి వెళ్లలేని భక్తుల కోసం ఇంటికే బస్సు పంపే ఏర్పాట్లు చేసింది. ఎక్కడైనా 30 మంది భక్తులు ఉన్నట్లయితే అక్కడికి ఆర్టీసీ బస్సును పంపించనున్నారు. మేడారం ప్రసాదాన్ని భక్తులకు ఇంటికే అందించేందుకు వీలుగా కార్గో సర్వీస్ అందిస్తున్నది. ఇదే కాకుండా మహా జాతరకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులను తరలించేందుకు వీలుగా 4 వేల బస్సులను ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రం నలుమూలల నుంచి 20 లక్షల మందికి జాతరకు తరలించేందుకు లక్ష్యం పెట్టుకుంది. 50 పడకల ఆసుపత్రి…30 హెల్త్ క్యాంపులు జాతరలో వైద్య సేవల కోసం 50 పడకల ఆసుపత్రి..30 హెల్త్ క్యాంపులు ఏర్పాటుచేశారు. వైద్య సేవలు అందించేందుకు 5192 మంది మెడికల్, పారా మెడికల్ సిబ్బందిని నియమించారు.