గ్రామీణ ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోంది: మంత్రి పొన్నం

Facebook
X
LinkedIn

హైదరాబాద్ :

కాంగ్రెస్ ప్రధానులు తెచ్చిన సంస్కరణల వల్లే దేశం ముందుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాంధీభవన్ లో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు కాంగ్రెస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పొన్నం మీడియాతో మాట్లాడుతూ.. మన జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన గ్రామస్వరాజ్యం స్ఫూర్తిగా నరేగాను యూపిఎ ప్రభుత్వం తెచ్చిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టంగా చేసేందుకే ఎంజి నరేగా తెచ్చారని అన్నారు. మహాత్మా గాంధీ పేరు తొలగించి జి రాంజి అనే పేరు పెట్టారని, గ్రామీణ ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉపాధి పథకాన్ని విస్తరిస్తామని చెప్పి.. ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలపై భారం మోపేలా కొత్త చట్టంలో 60:40 శాతం నిధుల నిబంధన పెట్టారని, కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలపై తీవ్ర భారాన్నిమోపిందని ధ్వజమెత్తారు. గాంధీ, దివంగత మాజీ ప్రధానమంత్రులు నెహ్రూ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు చరిత్రలో లేకుండా చేయాలని బిజెపి కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ప్రతి గ్రామంలో గాంధీ ఫొటోలతో పనిచేస్తూ నిరసనలు తెలపాలని, ఉపాధి హామీపథకాలన్ని దెబ్బతీసేలా చేసిన బిల్లును కేంద్రం వెనక్కి తీసుకోవాలని సూచించారు. బిజెపి నిర్ణయాన్ని నిరసిస్తూ తీర్మానం చేసి ప్రధాని నరేంద్ర మోడీకి పంపాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ వేడుకల్లో అందరూ మంత్రులు, నేతలు పాల్గొన్నారు.