సిరియాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు

Facebook
X
LinkedIn

సిరియాపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు

తీవ్ర సంక్షోభం నెలకొని ఉన్న సిరియాపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ఆకస్మికంగా దాడులకు దిగాయి. ఆ దేశ రాజధాని డమాస్కస్‌లో 25 కిలోమీటర్ల వరకు ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు చొచ్చుకు వచ్చాయని సిరియన్‌ ప్రతిపక్ష వార్‌ మానిటర్‌ మంగళవారం తెలిపింది.

డమాస్కస్‌, డిసెంబర్‌ 10: తీవ్ర సంక్షోభం నెలకొని ఉన్న సిరియాపై ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు ఆకస్మికంగా దాడులకు దిగాయి. ఆ దేశ రాజధాని డమాస్కస్‌లో 25 కిలోమీటర్ల వరకు ఇజ్రాయెల్‌ యుద్ధ విమానాలు చొచ్చుకు వచ్చాయని సిరియన్‌ ప్రతిపక్ష వార్‌ మానిటర్‌ మంగళవారం తెలిపింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్‌ ఖండించింది. అసోసియేట్‌ ప్రెస్‌ తెలిపిన వివరాల ప్రకారం సిరియా నగరం, సబర్బన్‌ ప్రాంతాల్లో భారీయెత్తున వైమానిక దాడులు జరిగాయి.

సిరియా గగనతలంలో మిస్సైల్‌ లాంచర్లు, హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్న దృశ్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ఈ దాడులపై తిరుగుబాటుకు నేతృత్వం వహించి సిరియాను ఆక్రమించుకున్న హయత్‌ తాహిర్‌ అల్‌ షామ్‌ (హెచ్‌టీఎస్‌) ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటికే సిరియాలోని సుమారు 400 కిలోమీటర్ల పరిధిలోని బఫర్‌జోన్‌ గోలన్‌ హైట్స్‌ను ఇజ్రాయెల్‌ దళాలు ఆదివారం స్వాధీనం చేసుకున్నాయి. సిరియా అతివాదుల పాలనలోకి వెళ్లనున్నందున ముందు జాగ్రత్త చర్యగా ఆ దేశంలోని రసాయన ఆయుధగారాలు, భారీ ఆయుధ స్థావరాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్‌ తెలిపింది.

రెబల్స్‌ తాత్కాలిక ప్రభుత్వం

అధికారాన్ని కైవసం చేసుకున్న సిరియన్‌ తిరుగుబాటుదారులు తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా మహమ్మద్‌ అల్‌ బషీర్‌ పేరును ఖరారు చేశారు. ఈ తాత్కాలిక ప్రభుత్వం మార్చి 1 వరకు అధికారంలో ఉంటుందని దేశ అధికారిక టెలివిజన్‌ టెలిగ్రామ్‌ అకౌంట్‌లో ప్రకటించారు. ఇంతకుముందు వాయువ్య సిరియా, ఐడ్లిబ్‌లోని కొన్ని ప్రాంతాలను పాలించిన హయత్‌ తహ్‌రిర్‌ అల్‌ షామ్‌(హెచ్‌టీఎస్‌) ప్రభుత్వాధినేతగా వ్యవహరించారు.

‘మానవ వధశాల’లో దారుణ పరిస్థితులు

అసద్‌ పాలన నుంచి విముక్తి లభించడంతో సంబరాలు చేసుకుంటున్న సిరియా ప్రజలు.. సైద్నాయ జైలులోని దారుణ పరిస్థితులు చూసి చలించిపోయారు. అసద్‌ పాలనను వ్యతిరేకించేవారిని ‘మానవ వధశాల’గా పిలిచే ఈ జైలులో బంధించే వారు. కనీసం కిటికీలు కూడా లేని చిన్న చిన్న గదుల్లో పదుల సంఖ్యలో ఖైదీలను పెట్టి హింసించేవారు. అసద్‌ను వ్యతిరేకించిన వేలాది మంది సిరియన్లు కనిపించకుండా పోయారు. వీరిని వెతుక్కుంటూ బంధువులు సైద్నాయ జైలులోకి చొచ్చుకెళ్లారు.

తిరుగుబాటుదారులు అడ్డుకున్నా లెక్కచేయకుండా వెళ్లి బందీలుగా ఉన్న వారిని విడిపించారు. అనేక ఏండ్ల తర్వాత తమ ఆత్మీయులను చూసుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఈ జైలులో భూగర్భంలో ఐదు అంతస్థులు ఉన్న అండర్‌గ్రౌండ్‌ జైలు కూడా ఉంది. అసద్‌ వ్యతిరేకులను ఇక్కడికి తీసుకొచ్చి విద్యుత్తు షాక్‌ ఇవ్వడంతో పాటు దారుణంగా హింసించే వారని చెప్తున్నారు. ఈ జైలులో 2011 నుంచి 2016 మధ్య 13 వేల మంది సిరియన్లను ప్రభుత్వ బలగాలు రహస్యంగా హతమార్చాయని మానవ హక్కుల సంస్థలు చెప్తున్నాయి.