తెలంగాణ సిఎంవొ, మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్స్ హ్యాక్

Facebook
X
LinkedIn

 హైదరాబాద్ :

సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించిన ఏదో మూల చాప కింద నీరులా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరూ అతీతులు కారు. తాజాగా తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వాట్సాప్ గ్రూప్‌తో పాటు, పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్‌లను హ్యాక్ చేశారు. ఎస్‌బిఐ అకౌంట్ ఆధార్ వెరిఫికేషన్ పేరుతో ప్రమాదకర ఎపికె ఫైల్స్‌ని కేటుగాళ్లు పంపించారు. వెంటనే సదురు ప్రమాదకరమైన లింకులు క్లిక్ చేసి ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇది గమనించిన సైబర్ నిపుణులు అలాంటి లింక్స్ జోలికి వెళ్లవద్దని సూచించారు. కాగా, ఎనిమిది రోజుల క్రితమే సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేసేందుకు చూస్తే.. అది గేమింగ్ సైట్‌లోకి వెళ్లేలా మార్చేశారు. దీనిపై హైకోర్టు రిజిస్టార్ డిజిపికి ఫిర్యాదు చేశారు.