ఐబొమ్మ రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా..

Facebook
X
LinkedIn

    హార్డ్‌ డిస్క్‌లో 21 వేల సినిమాలు: సీపీ సజ్జనార్‌

హైదరాబాద్‌ :

చిత్ర పరిశ్రమకు మేలు చేసే ఒక కేసును ఛేదించామని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌   వ  అన్నారు. పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు చాలా నష్టం జరిగిందని చెప్పారు. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా ఐబొమ్మ   నిర్వాహకుడు ఇమ్మడి రవిని   అరెస్టు చేసినట్లు తెలిపారు. అతనిపై ఐటీ యాక్ట్‌, కాపీ రైట్‌ యాక్ట్‌ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీపెద్దలు చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌ బాబుతో పాటు దర్శకుడు రాజమౌళి సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు. అనంతరం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్‌, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశాం. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం చేకూర్చాడు. పైరసీ ద్వారా చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేశాడు. దీంతో చాలా మంది డబ్బు, ప్రాణాలు కోల్పోయారు.ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్‌ చేస్తే కొత్త సైట్‌ను తయారు చేశాడు. ఇలా65 మిర్రర్‌ వెబ్‌సైట్లు నిర్వహించాడు. 21 వేల సినిమాలు అతడి హార్డ్‌ డిస్క్‌లో ఉన్నాయి. 1972లో విడుదలైన గాడ్‌ఫాదర్‌ నుంచి మొన్న వచ్చిన ఓజీ వరకు అందులో ఉన్నాయి. పైరసీ ద్వారా రూ.20 కోట్లు సంపాదించాడు. అందులో రూ.3 కోట్లు సీజ్‌ చేశాం. సైట్‌ను సందర్శించిన వారి డేటా మొత్తం రవి వద్ద ఉంది. ప్రజల డాటాను సైబర్‌ నేరాల ముఠాలకు అమ్ముకున్నారు. డేటా చోరీ జరగడం వల్ల ప్రజలకు కూడా వేల కోట్ల నష్టం జరిగింది. రవి వద్ద 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా ఉంది. ఇంత డేటా అతడి వద్ద ఉండటం ప్రమాదకరం. దీన్ని సైబర్‌ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉంది.ఇమ్మడి రవి స్వస్థలం విశాఖపట్నం. బీఎస్సీ కంప్యూటర్స్‌ చదివిన అతడు వేరే పేర్లతో మహారాష్ట్రలో డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌ కార్డులు తీసుకున్నాడు. మొదటి నుంచి నేర ప్రవృత్తితో ఉన్నాడు. సినీరంగం అప్రమత్తమై ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు అతడి వెంట పడ్డారు. దీంతో భారత పౌరసత్వాన్ని వదిలి కరేబియన్‌ దీవుల్లో ఉన్న సెయింట్‌ నేవీ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్‌లో ఉంటూ వివిధ దేశాలు తిరిగేవాడు. 2019 నుంచి ఐబొమ్మ వెబ్‌సైట్‌ను నడుపుతున్నాడు. 21 వేల సినిమాలు పైరసీ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్‌, నెదర్లాండ్‌ నుంచి సర్వర్లు నడుపుతున్నాడు. 110 డొమైన్లను రవి ముఠా కొనుగోలు చేసింది. ఒకటి బ్లాక్‌ చేస్తే మరొకటి ఓపెన్‌ చేస్తూ పైరసీ సినిమాలు విడుదల చేశాడు. సీక్రెట్‌ కెమెరాలు, టెక్నాలజీ వాడుతూ సినిమాలు పైరసీ చేశాడు. టెలిగ్రామ్‌ చానళ్ల ద్వారా సినిమాల డేటా ట్రాన్స్‌ఫర్‌ జరిగింది. ప్రజలు కూడా ఇలాంటి పైరసీ వెబ్‌సైట్లను ప్రోత్సహించకూడదు. ఏపీకే ఫైల్స్‌ క్రియేట్‌ చేసి ప్రజలడేటా చోరీ చేశారు. ఇమ్మడి రవిని పోలీసులే స్వతహాగా పట్టుకున్నారు. ఎవరో ఇచ్చిన సమాచారంతో పట్టుకున్నామనేది అబద్ధం. ఈ రాకెట్‌లో ఉన్న మిగతా వాళ్లను కూడా బయటకు తీసుకువస్తాం’ అని సజ్జనార్‌ చెప్పారు.