క్యాన్సర్ రోగికి వెస్సో దాతల 51,100 సహాయం

Facebook
X
LinkedIn

హైద్రాబాద్ :

హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌ కు చెందిన అంబర్‌పేట్ యాదగిరి(50) నిమ్స్‌ ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ కార్మికునిగా పని చేసే వారు. భార్య తో పాటు వారికి ఇద్దరు కుమార్తెలు; ఇద్దరూ ప్రైవేట్‌ పాఠశాలలో ప్రాథమిక/ఉన్నత ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నారు. వారి కుటుంబానికి ఆయనే ఏకైక ఆధారం. ఈమధ్యఆయన నాలుకపై పుండ్లు రావడంతో వైద్య పరీక్షలు చేయించగా, నోటి క్యాన్సర్‌ గా నిర్ధారణ అయింది. నిమ్స్‌ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకోగా, నాలుకలో ఒక భాగాన్ని తొలగించారు. ఆపరేషన్‌ సమయంలో మెడ వరకూ దాదాపు 25 కుట్లు వేయడం లో, భుజానికి సంబంధించిన ఒక నరము కూడా తెగినది. ఫలితంగా యాదగిరి సరిగ్గా మాట్లాడలేకపోవడం, ఘన ఆహారం తినలేక పోవడం, చేతిని ఎత్తలేక పోవడం వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. వైద్యులు రేడియేషన్‌ థెరపీ చేయించమని సూచించినప్పటికీ, నిమ్స్‌ లో ఆ సదుపాయం లేకపోవడంతో ఆయన ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించు కోవలసి వచ్చింది. ఈపాటికి 50,000 వరకు ఖర్చు అయినది, ఇది వారి కుటుంబ సామర్థ్యానికి మించిన ఖర్చు. ప్రస్తుతం ఆయన తీవ్రమైన నొప్పితో ఇంట్లోనే ఉంటూ, ద్రవ ఆహారంతోనే జీవిస్తున్నారు. కుమార్తెల విద్యను కొనసాగించడం కుటుంబానికి కష్టసాధ్యమవుతోంది. ట్యూషన్‌ ఫీజులు చెల్లించలేకపోవడంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు మార్చాలని భావించినప్పటికీ, విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం వల్ల మార్పు సాధ్యం కాలేదు. ఇంతవరకు ఆయన భార్య తరపు బంధువులు కొంత సహాయం అందించారు.మల్కాజ్‌గిరి నాయకులు బంగారు మల్లేష్ చారి ద్వారా యాదగిరి భార్య భవాని వెస్సో ట్రస్ట్‌ ను సంప్రదించి, తదుపరి చికిత్స కొరకు ఆర్థిక సహాయం కోసం విన్నపం చేశారు. వెస్సో ట్రస్టీలు గౌరవ దాతల సహకారంతో ఆమెకు 51,100 అందజేశారు.