నల్లగొండలో ఉగ్రరూపం దాల్చిన మూసీ ఏడు గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కుల నీటి విడుదల

Facebook
X
LinkedIn

నల్లగొండ :

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి వరదనీరు పెద్దఎత్తున చేరడంతో కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది.

వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులోని 3, 4, 5, 6, 8, 10, 12 నంబర్ల క్రస్ట్‌గేట్లను నాలుగు అడుగుల మేర ఎత్తి, 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్టు తెలిపారు.

దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు
నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని, పశువులను కూడా నది వైపు తీసుకెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

జూలూరు-రుద్రవెల్లి బ్రిడ్జిపై వరద ప్రవాహం
మూసీ ఉద్ధృతి కారణంగా జూలూరు-రుద్రవెల్లి వద్ద ఉన్న లోలెవల్ బ్రిడ్జి మీదుగా నీరు పొంగిపొర్లుతోంది. దీంతో పోచంపల్లి–బీబీనగర్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీబీనగర్, భువనగిరి వైపు వెళ్లాల్సిన వాహనదారులు పెద్ద రావులపల్లి మీదుగా మార్గం మళ్లిస్తున్నారు.

బారికేడ్లు.. పోలీసు బందోబస్తు
జాగ్రత్త చర్యగా అధికారులు బ్రిడ్జి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి, ఎవరూ ఆ ప్రాంతంలోకి వెళ్లకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తున్నారు.

మండల తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఆర్ఐ గుత్తా వెంకట్ రెడ్డి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, మూసీ సమీప ప్రాంతాల్లో సంచరించవద్దని వారు విజ్ఞప్తి చేశారు.