కర్నూలు బస్సు ప్రమాదం- 20 మంది ప్రయాణికులు మృతి – సహాయక చర్యల్లో కలెక్టర్ పర్యవేక్షణ

Facebook
X
LinkedIn


కర్నూలు: 
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారి కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయక చర్యలు ప్రారంభించినట్లు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ తెలిపారు.  

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ సంతోష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఉదయం ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాదు నుంచి బెంగళూరు బయలుదేరిన కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మొత్తం 41 మంది ప్రయాణికులు, డ్రైవర్, క్లీనర్ ఉన్నట్లు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 20 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.  

మృతదేహాలను వైద్య సిబ్బంది బస్సు నుంచి వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని కలెక్టర్ చెప్పారు. గాయపడిన వారికి కర్నూలు ప్రభుత్వాసుపత్రి, పలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స అందుతోందని వివరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్పారు.  

బస్సులో తెలంగాణకు చెందిన 13 మంది, ఆంధ్రప్రదేశ్‌కి చెందిన 12 మంది, ఇతర రాష్ట్రాల నుంచి మిగతా ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. బాధితుల కుటుంబాలకు అవసరమైన సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్‌డెస్క్ నంబర్లను అందుబాటులో ఉంచామని వివరించారు.  

సహాయ కేంద్రాల ఫోన్ నంబర్లు:  
– గద్వాల జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 95022 71122  
– గద్వాల జిల్లా హెల్ప్‌డెస్క్‌లు: 91009 01599, 91009 01598  
– గద్వాల జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్: 87126 61828  
– కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కంట్రోల్ రూమ్: 91009 01604