అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీలో జాప్యం

Facebook
X
LinkedIn

హైదరాబాద్‌, :

అంగన్‌వాడీ   టీచర్లు, సూపర్‌వైజర్లకు స్మార్ట్‌ఫోన్ల పంపిణీలో కాంగ్రెస్‌ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. అయితే కమీషన్ల వాటా తేలకపోవడంతోనే జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కారు అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌వైజర్ల కోసం గత జూన్‌ 12న టీటీఎస్సీ(తెలంగాణ టెక్నికల్‌ సర్వీస్‌ సెంటర్‌) ద్వారా టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా 38,117 స్మార్ట్‌ఫోన్లు సమకూర్చుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జూన్‌ 23లోగా దరఖాస్తు చేసుకోవాలని సెల్‌ఫోన్ల కంపెనీలకు సూచించినప్పటికీ అంతకుముందే ఓ కంపెనీకి చెందిన మోడల్‌ను ఖరారు చేసింది. ప్రీబిడ్‌ మీటింగ్‌ నిర్వహించకుండా టెండర్‌ ప్రక్రియ ముగియకముందే ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మధ్యవర్తిత్వం వహించిన అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి అధికారులు తమకు నచ్చిన ఒక కంపెనీకి అనుగుణంగా టెండర్‌ మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని నెలల పాటు టెండర్లను పక్కనబెట్టింది. ఈ వ్యవహారం సద్దుమణగడం తో ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా ఆ కంపెనీకే కాంట్రాక్ట్‌ కట్టబెట్టినట్లు తెలుస్తున్నది. కంపెనీ బాధ్యులు కమీషన్లు ముట్టజెప్పకపోవడం వల్లే పంపిణీ ఆలస్యమవుతున్నట్లు సంబంధిత శాఖ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది.