అమరావతి :
పేదవాళ్ల కోసం అన్న క్యాంటీన్లు ఇంకా పెంచుతామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ ఐటి హబ్ గా మారబోతుందని అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పేదల సేవలో ప్రజావేదిక సభలో సిఎం మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రలో రూ. 2 వేల కోట్లు ఖర్చుపెట్టి వందశాతం అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నామని, విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడామని రూ.11,400 కోట్లు ఇప్పించామని తెలియజేశారు. ప్రపంచస్థాయి కంపెనీలు విశాఖకు తరలివస్తాయని, 10, 579 మందికి వితంతు పింఛన్లు ఇచ్చామని చెప్పారు. ప్రతి నెలా ఒకటినే పింఛన్ల పండుగ చేసుకుంటున్నామని, ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని అన్నారు. Also Read – తొలి టెస్ట్‌కి బుమ్రా దూరం? గిల్ ఏమన్నాడంటే.. ఈ 16 నెలల్లో పేదలకు రూ. 48,019 కోట్లు ఇచ్చామని చెప్పారు. గతంలో ఒక నెల తీసుకోకపోతే ఇచ్చేవాళ్లు కాదని.. ఇప్పుడు తర్వాత నెలలో కూడా తీసుకోవచ్చునని తెలిపారు. పింఛన్ల పంపిణీ సమయంలో ఎక్కడ ఉంటే అక్కడ తీసుకునే అవకాశం ఇస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. పింఛన్ సొమ్మును పది రెట్లు పెంచిన ఘనత టిడిపిది అని కొనియాడారు. మహిళలను అన్ని రంగాల్లో పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని, సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని, మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. ప్రతినె లా ఒక గ్రామానికి నేరుగా వచ్చి తానే పర్యవేక్షిస్తున్నానని, 2 కోట్ల 66 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, రూ. 1,718 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఆడబిడ్డల కోసం ఆగష్టు 15న స్త్రీశక్తి పథకం తీసుకొచ్చామని, ఒకప్పుడు పది లక్షల మందే బస్సులు ఎక్కేవారని.. ఇప్పుడు డబుల్ అయిందని ప్రశంసించారు. ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ఉద్దేశం అని చంద్రబాబు స్పష్టం చేశారు.