దిశ, తొర్రూర్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు బస్టాండ్ లో మరోసారి దొంగతన ఘటన చోటు చేసుకుంది. కొడకండ్ల గ్రామానికి చెందిన ఎర్రం శివలక్ష్మి అనే మహిళ తన భర్త కృష్ణయ్యతో కలిసి తొర్రూరులో కూతురి ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో సోమవారం బస్టాండ్ లో సాయంత్రం 5 గంటల సమయంలో ఆగారు. ఈ సమయంలో, ఆమె మెడలో ఉన్న ఆరు తులాల హారం బంగారాన్ని దొంగలు చోరీ చేశారు.
దొంగతనాల పట్ల నిర్లక్ష్యం..
తొర్రూరు బస్టాండ్ లో ఈ ఘటన మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ బస్టాండులో అనేక దొంగతనాలు జరిగినప్పటికీ, అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీని వల్ల దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువుల చోరీలు ఇప్పటికే పలుమార్లు జరిగినప్పటికీ, బస్టాండ్ యాజమాన్యం దీనిపై తగిన చర్యలు తీసుకోవడం లేదు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తొర్రూరు బస్టాండ్ లో సీసీ కెమెరాలు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రయాణికుల ఆందోళన..
బస్టాండ్ లో జరిగిన ఈ విధమైన ఘటనలపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరాలు పని చేయకపోవడం వల్లే దొంగలు ఆత్మవిశ్వాసం గా ప్రవర్తిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాండ్ నిర్వాహకులు తక్షణమే సీసీ కెమెరాలను సరిచేయాలని, భద్రతా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలీసుల దృష్టి..
ఈ ఘటనపై బాధితురాలు శివలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా,దర్యాప్తు మొదలైంది. సీసీటీవీ ఫుటేజ్ లభించకపోయినా, అక్కడి ప్రజల సహకారంతో దొంగలను గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తొర్రూరు సబ్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపారు.