ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతి లోకి.. మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం..

Facebook
X
LinkedIn

                    ఆ పార్టీ నేత అభయ్‌ పేరుతో ఒక లేఖ విడుదల

హైదరాబాద్  :

మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నది. ఆయుధాలు విడిచిపెట్టేందుకు ఆ పార్టీ సిద్ధమైంది. మారిన ప్రపంచ, దేశ పరిస్థితుల దృష్ట్యా.. ఆయుధాలను విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని ప్రధాని, కేంద్ర హోం శాఖ మంత్రి, సీనియర్‌ పోలీస్‌ అధికారులు నిరం తరం చేసిన అభ్యర్థనల దృష్ట్యా తమ పార్టీ ఆయుధాలను వదులు కోవాలని నిర్ణయించుకుంటున్నదని ఆ పార్టీ నేత అభయ్‌ పేరుతో ఒక లేఖ విడుదలైంది. సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ ప్రకటించాలని తమ పార్టీ నిర్ణయించుకుంటున్నదని అందులో పేర్కొన్నారు. భవిష్యత్తులో ప్రజా సమస్యలపై అన్ని రాజకీయ పార్టీలు, పోరాడుతున్న సంస్థలతో వీలైనంత వరకు కలిసి పోరాడుతామని వివరించారు. ఈ అంశంపై కేంద్ర హోం శాఖ మంత్రితో లేదా ఆయన నియమించిన వ్యక్తులతో లేదా ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. మారిన తమ పార్టీ అభిప్రాయం గురించి పార్టీకి తెలియజేయడం తమ బాధ్యత అని, పార్టీలో ఈ అంశాన్ని అంగీకరించేవారు లేదా వ్యతిరేకించేవారు చర్చల్లో అంగీకరించి పాల్గొనే సహచరుల నుంచి ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.ప్రస్తుతం తమతో అందుబాటులో ఉన్న పరిమిత క్యాడర్‌, కొంతమంది నాయకత్వ సహచరులు ఈ కొత్త విధానాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో పనిచేస్తున్న సహచరులతో, జైల్లో ఉన్న సభ్యులతో సంప్రదించేందుకు నెలరోజుల గడువు ఇస్తూ ‘సీజ్‌ ఫైర్‌’ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ప్రభుత్వంతో వీడియోకాల్‌ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకునేందుకు కూడా తమ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అయితే, మావోయిస్టు పార్టీలో మారిన ఈ విధానం సంచలం సృష్టిస్తున్నది. మావోయిస్టు పార్టీ సుప్రీం లీడర్‌ బసవరాజు మృతి తరువాత ఇటీవల కొత్త నాయకత్వంలో భాగంగా ఆయన స్థానంలో తిప్పిరి తిరుపతిని ప్రధాన కార్యదర్శిగా ఎంచుకున్న నేపథ్యంలో ఈ లేఖ విడుదల అవ్వడం మరింత సంచలనం కలిగిస్తున్నది. అంతేకాకుండా, ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు నేత (అజ్ఞాత నేత) ఫొటోతో ఆ పార్టీ లేఖను విడుదల చేయడం దేశంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చర్చానీయాంశంగా మారింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్‌ పేరుతో వచ్చిన ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది.