తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీనటుడు మోహన్‌బాబు స్పందించారు.

By Entertainment Team Updated : 11 Dec 2024 09:33 IST

హైదరాబాద్: తన కుటుంబంలో చోటు చేసుకున్న పరిణామాలపై సినీనటుడు మోహన్‌బాబు (Mohanbabu) స్పందించారు. మంగళవారం రాత్రి తన నివాసం వద్ద జరిగిన ఘటన అనంతరం ఆయన ఆడియో సందేశం విడుదల చేశారు.
‘‘మనోజ్ నువ్వు నా బిడ్డవి. లక్ష్మీప్రసన్న, విష్ణువర్ధన్‌బాబు, మనోజ్ కుమార్ మిమ్మల్ని ఎలా పెంచాను? అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చుపెట్టి చదివించాలని ప్రయత్నించాను. నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చాను. నువ్వు ఈరోజు నా గుండెల మీద తన్నావ్. నా మనసు ఆవేదనతో కుంగిపోతోంది. నా బిడ్డ నన్ను తాకలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి కుటుంబంలోనూ ఘర్షణలు ఉంటాయి.
జల్పల్లి ఇల్లు నా కష్టార్జితం.. నీకు సంబంధం లేదు. మంచు మనోజ్ మద్యానికి బానిసగా మారాడు. మద్యం మత్తులో ఎలాగో ప్రవర్తిస్తున్నాడు. ఇంట్లో పనిచేస్తున్న వారిపై దాడికి దిగడం మనోజ్‌కు సరికాదు. ఇక చాలు నా పరువు ప్రఖ్యాతలు మంటగలిపావు. నన్ను ఎవరూ మోసగాడు అనలేదు. నీకు జన్మనివ్వడమే నేను చేసిన పాపమా? ఆస్తులు ముగ్గురికీ సమానంగా రాయాలా? వద్దా? అనేది నా ఇష్టం. ఆస్తులు ఇస్తానా.. లేదా.. దాన ధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టం నా ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. మనోజ్ నీ వల్ల మీ అమ్మ ఆసుపత్రిలో చేరింది. భార్య మాటలు విని తాగుడుకు అలవాటు పడ్డావు. తప్పు చేయనని చెప్పి మళ్లీ ఇంట్లోకి వచ్చావు. మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అనేది సినిమా షూటింగ్‌ల్లో తప్ప ఇంట్లో కాదు. నా ఫిర్యాదుపై పోలీసులు స్పందించ లేదు. నా ఇంట్లోకి ఎవరినీ రానివ్వకుండా అడ్డుకోవాల్సిన పోలీసులు చూస్తూ ఊరుకున్నారు. పోలీసు శాఖ అంటే నాకెంతో గౌరవం ఉంది. న్యాయం, ధర్మంగా నడుచుకోవాలి. మనోజ్ వచ్చి తన బిడ్డను తీసుకెళ్లొచ్చు. రాకపోతే ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచుతా. ఆసుపత్రి నుంచి మీ అమ్మ డిశ్చార్జ్ అయిన తర్వాత .. పోలీసుల సమక్షంలో నీకు అప్పగించమని చెబతా. ఇక చాలు.. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం’’ అని మనోజ్‌కు పంపిన ఆడియో సందేశంలో పేర్కొన్నారు.
చిరిగిన చొక్కాతో బయటకు వచ్చిన మనోజ్..
జల్పల్లిలో సినీనటుడు మోహన్‌బాబు (Mohan Babu) నివాసం వద్ద మంగళవారం రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్‌బాబు నివాసానికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. భద్రతా సిబ్బంది గేట్లు తీయకపోవడంతో.. ‘నా కుమార్తె లోపల ఉంది’ అంటూ మనోజ్ అక్కడి భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గేట్లు తోసుకుని లోపలికి దూసుకెళ్లారు. మనోజ్ వెంట వచ్చిన బౌన్సర్లను పోలీసులు బయటకు పంపించేశారు. దాడి జరగడంతో చిరిగిన చొక్కాతోనే మనోజ్ బయటకు వచ్చారు.
మీడియా ప్రతినిధులపై చేయిచేసుకున్న మోహన్‌బాబు
మరోవైపు, ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్‌బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు ప్రతినిధులపై ఆయన చేయి చేసుకున్నారు. మోహన్‌బాబు బౌన్సర్ల దాడిలో ఓ కెమెరామెన్ కిందపడ్డారు. విలేకరులను బయటకు నెట్టేసి బౌన్సర్లు గేటుకు తాళం వేశారు.