జిఎస్టి విధానాన్ని సవరించాలన్న కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం గ్రీన్‌ సిగ్నల్‌

Facebook
X
LinkedIn

న్యూ డిల్లీ :

వస్తువులు, సేవల పన్ను (GST) విధానాన్ని సవరించాలన్న కేంద్రం ప్రతిపాదనలకు మంత్రుల బృందం   అంగీకరించింది. 12, 28 శాతం శ్లాబులు తొలగించి 5, 18 శాతం శ్లాబులు మాత్రమే ఉంచేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గురువారం జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు మంత్రుల బృందం ఆమోదం తెలిపింది.జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబులున్నాయి. మార్కెట్‌లోని దాదాపు అన్ని వస్తూత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి. అయితే, 5, 18శాతం స్లాబ్‌లను మాత్రమే కొనసాగించాలని, 12, 28 స్లాబ్‌లను తొలగించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ.. ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఆయా రాష్ట్రాల మంత్రులతో కూడిన బృందం తాజాగా ఆమోదం తెలిపింది. ఆల్ట్రా లగ్జరీ, సిన్‌ గూడ్స్‌ (సిగరెట్లు వంటివి)పై 40 శాతం పన్ను విధించడం కూడా కేంద్ర ప్రతిపాదనలో ఉందని యూపీ ఆర్థికమంత్రి సురేష్‌ కుమార్‌ ఖన్నా తెలిపారు. 12 శాతం స్లాబులోని 99 శాతం వస్తూత్పత్తులు 5 శాతంలోకి, 28 శాతం స్లాబులోని 90 శాతం వస్తూత్పత్తులు 18 శాతంలోకి రానున్నట్లు తెలిసింది.ప్రస్తుతం జీఎస్టీలో కనీస పన్ను 5 శాతం స్లాబులో రోజువారీ నిత్యావసర వస్తూత్పత్తులున్నాయి. ఇక స్టాండర్డ్‌ గూడ్స్‌పై 12 శాతం, ఎలక్ట్రానిక్స్‌, ఆయా రకాల సేవలపై 18 శాతం, పొగాకు, ఇతర విలాసవంతమైన ఐటమ్స్‌పై గరిష్ఠంగా 28 శాతం పన్నులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అదనంగా పాన్‌ మసాలా, లగ్జరీ కార్లు తదితరాలపై జీఎస్టీ నష్టపరిహార సెస్సును కూడా విధిస్తున్నారు. జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి వాటిల్లుతున్న నష్టాలను భర్తీ చేయడానికే ఈ సెస్సు. అలాగే కొన్ని నిత్యావసరాలకు జీఎస్టీ మినహాయింపుండగా.. ప్రత్యేకంగా వజ్రాలు, సానబెట్టిన రత్నాలు, బంగారంపై 0.25 శాతం నుంచి 3 శాతం వరకు జీఎస్టీ విధిస్తున్నారు.