ధన్‌ఖడ్ రాజీనామాపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలు
న్యూ డిల్లీ :
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నిర్ణయం అందరినీ షాక్‌కు గురి చేసింది. ధన్‌ఖడ్ రాజీనామాపై ప్రతిపక్షాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రాజీనామా తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ సభ్యులు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదు. ఆయన్ని సంప్రదించలేకపోతున్నారు. దీంతో ‘జగదీప్ ధన్‌ఖడ్ ఎక్కడ..?’ అంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.ఇదే విషయమై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు లేఖ రాశారు. ధన్‌ఖడ్‌ను తాము చేరుకోలేకపోతున్నామని, ఆయన ఎక్కడ ఉన్నారంటూ ప్రశ్నించారు. ఆయన ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రాజీనామా చేసినప్పటి నుంచి ధన్‌ఖడ్ గురించి ఎలాంటి సమాచారం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన భద్రతపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ధన్‌ఖడ్‌కు ఏం జరిగింది..? ఆయన క్షేమంగానే ఉన్నారా? ఆరోగ్యంగానే ఉన్నారా..? అని ప్రశ్నించారు. ఆయన్ని కలిసేందుకు పలువురు రాజ్యసభ ఎంపీలు ప్రయత్నించినట్లు చెప్పారు. కానీ, ఆయన్ని చేరుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ఆయన ప్రస్తుత లొకేషన్ ఏంటి? ఆయన ఆరోగ్యం ఎలా ఉంది?వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని లేఖలో సంజయ్ రౌత్ పేర్కొన్నారు.పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు జూలై 21న రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపారు. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వడం, వైద్యుల సలహాను పాటించడం కోసమే తాను ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామా చేస్తున్నానని ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 67(ఏ) అధికరణ కింద ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి కార్యాలయం ఈ లేఖను విడుదల చేసింది. తన బాధ్యతలను నిర్వర్తించడంలో పూర్తి సహకారాన్ని అందచేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండేండ్లు పదవీకాలం ఉండగానే ధన్‌ఖడ్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.