డిజిటల్‌ ఓటర్‌ లిస్ట్‌ను బయటపెట్టాలి

Facebook
X
LinkedIn

   ఈసీని డిమాండ్‌ చేసిన ప్రతిపక్ష నేత రాహుల్‌..!

న్యూ డిల్లీ :

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై మరోసారి ఎన్నికల కమిషన్‌ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించారు. సోషల్‌ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా ఓ వీడియోను షేర్‌ చేశారు. ‘ఓటు దొంగతనం అనేది ఒక వ్యక్తి, ఒక ఓటు అనే ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం దాడి. స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికలకు స్వచ్ఛమైన ఓటరు జాబితా అవసరం. ఎన్నికల కమిషన్‌కు తమ డిమాండ్‌ స్పష్టంగా ఉంది.పారదర్శకతను చూపించాలి. డిజిటల్‌ ఓటర్‌ లిస్ట్‌ను బయటపెట్టాలి. తద్వారా ప్రజలు, రాజకీయ పార్టీలు దాన్ని స్వయంగా ఆడిట్‌ చేయాలి. మీరు కూడా మాతో చేరి ఈ డిమాండ్‌కు మద్దతు ఇవ్వొచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.. లేదంటో 9650003420 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వండి’ అని రాహుల్‌ పిలుపునిచ్చారు. ఈ పోరాటం ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికేనని స్పష్టం చేశారు. వీడియోలో బీజేపీ, ఎన్నికల కమిషన్‌ కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డారని మరోసారి ఆరోపించారు. కర్నాటకలోని ఓ నియోజకవర్గం పరిధిలో ఓటరు విశ్లేషణకు సంబంధించి వివరాలను ఉదహరించారు. బెంగళూరు సెంట్రల్‌లోని కేవలం ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో లక్షకుపైగా ఫేక్‌ ఓటర్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ లోక్‌సభ స్థానం బీజేపీ గెలిచేందుకు సహాయపడిందన్నారు. 70-100 సీట్లలో ఇలా జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని.. ఇది స్వేచ్ఛా ఎన్నికలను నాశనం చేస్తుందన్నారు.తమ వద్ద ఆధారాలు ఉన్నాయని.. ఓట్ల దొంగతనంపై తాము శక్తిమేరకు పోరాడుతామన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తమతో కలిసి రావాలని కోరారు. ఒక వ్యక్తి పోర్టల్‌లో నమోదు చేసుకునే సమయంలో ‘ఓటు దొంగతనం’కు వ్యతిరేకమని పేర్కొంటూ.. అతని పేరుపై ఓ సర్టిఫికెట్ జారీ చేయబడుతుందన్నారు. ఎన్నికల కమిషన్‌ నుంచి డిజిటల్‌ ఓటరు జాబితా కోసం రాహుల్‌ గాంధీ డిమాండ్‌కు తాను మద్దతు ఇస్తున్నానంటూ ఆ సర్టిఫికెట్‌లో ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ సంతకాలుంటాయి.