ఓటు హక్కు పై మీరు దాడిచేస్తే, మీపై మేం దాడి చేస్తాం

Facebook
X
LinkedIn

ఎన్నికల సంఘం  ను హెచ్చరించిన  కాంగ్రెస్ అగ్రనేత   రాహుల్ గాంధీ

న్యూ డిల్లీ :

భారత ప్రజలకు రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కు   పై మీరు దాడిచేస్తే, మీపై మేం దాడి చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత   లోక్‌సభ   లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ   కేంద్ర ఎన్నికల సంఘం  ను హెచ్చరించారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ శుక్రవారం బెంగళూరు   లోని ఫ్రీడమ్ పార్క్‌   లో నిర్వహించిన నిరసన సభలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. ఇది కేవలం తన గొంతుక కాదని, యావత్ హిందుస్థాన్ గొంతుక అని స్పష్టం చేశారు. ఎన్నికల మోసం ఫిర్యాదుపై తన నుంచి ఈసీ అఫిడవిట్ కోరిందని, కానీ తాను ఇప్పటికే లోక్‌సభలో రాజ్యాంగంపై ప్రమాణం చేశానని రాహుల్ గుర్తుచేశారు. రాజ్యాంగ మౌలిక సూత్రం ‘ఒక వ్యక్తి, ఒక ఓటు’ అని, ఈసీ అధికారులు దానిపైనే దాడి చేస్తున్నారని విమర్శించారు. మీరు పేదలపై దాడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో మోసం చేసి సులభంగా తప్పించుకోవచ్చని అనుకుంటే పొరపాటని, సమయం పట్టినా మిమ్మల్ని ఒక్కొక్కరిగా పట్టుకుంటామని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు.బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఒక్క మహాదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌పై మాత్రమే తాము దృష్టి సారించామని, అక్కడ బీజేపీ, ఈసీ కుమ్మక్కై మోసానికి పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు లభించాయని రాహుల్‌గాంధీ ఆరోపించారు. మహాదేవపురలో మొత్తం 6.5 లక్షల ఓటర్లు ఉంటే, అందులో 1.25 లక్షల ఓట్లను దొంగిలించారని, అంటే ప్రతి ఆరుగురిలో ఒక ఓటును తారుమారు చేశారని రాహుల్‌గాంధీ చెప్పారు. ఈ మోసం ఐదు ప్రధాన పద్ధతుల్లో జరిగిందని ఆరోపించారు.