మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు
అసెంబ్లీకి వెల్లడించిన సీఎం మోహన్ యాదవ్
భోపాల్ :
సుమారు 23,000 మంది మహిళలు, బాలికలు కనిపించడం లేదు. అత్యాచారం, మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం ఈ విషయాలను స్వయంగా అసెంబ్లీకి వెల్లడించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో మహిళలు, బాలికలు అదృశ్యమవుతున్నారు. మహిళలపై అత్యాచార కేసులు కూడా పెరుగుతున్నాయ. మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలా బచ్చన్ దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసుల వివరాలను అసెంబ్లీలో కోరారు.కాగా, మధ్యప్రవేశ్ సీఎం మోహన్ యాదవ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2024 జనవరి 1 నుంచి 2025 జూన్ 30 వరకు 21175 మంది మహిళలు, 1954 మంది బాలికలు అదృశ్యమయ్యారు. ఏడాదికిపైగా ఆ రాష్ట్రంలో తప్పిపోయిన మహిళల సంఖ్య 23129కు చేరుకున్నదని వెల్లడించారు.మరోవైపు అత్యధికంగా సాగర్ జిల్లాలో 1,069 మంది మహిళలు మిస్సింగ్ అయ్యారు. జబల్పూర్ జిల్లాలో 946 మంది, ఇండోర్ జిల్లాలో 788 మంది, భోపాల్ (గ్రామీణ) జిల్లాలో 688 మంది, ఛతర్‌పూర్ జిల్లాలో 669 మంది, రేవా జిల్లాలో 653 మంది, ధార్ జిల్లాలో 637 మంది, గ్వాలియర్ జిల్లాలో 617 మంది మహిళలు అదృశ్యమయ్యారు.కాగా, అత్యాచారం, మహిళలపై జరిగిన నేరాలతో సంబంధం ఉన్న 1,500 మంది నిందితులు పరారీలో ఉన్నారు. మహిళలపై అత్యాచారం చేసిన నిందితుల్లో 292 మంది, మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో 283 మంది అంటే మొత్తంగా 575 మంది అత్యాచార నిందితులు ఇప్పటికీ స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నది. లైంగిక వేధింపుల కేసుల్లో పరారీలో ఉన్న వారి సంఖ్య 610కు చేరింది. మహిళలు, బాలికల అదృశ్యానికి సంబంధించిన ఇతర కేసుల్లో 320 మంది నిందితులు పరారీలో ఉన్నారు.