హిమాచల్ ప్రదేశ్ :
హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ వర్షాలకు ప్రధాన నదులకు వరద పోటెత్తుతోంది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా భారీ వర్షాల కారణంగా హిమాచల్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కాంగ్రా లోని ధంగులో చక్కి నది పై ఉన్న రైల్వే వంతెన బేస్ ఒక్కసారిగా కూలిపోయింది బ్రిడ్జిపై ఓ రైలు ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.పఠాన్కోట్ మీదుగా ఢిల్లీ-జమ్ము మార్గంలో చక్కి నదిపై ఈ వంతెనను నిర్మించారు. అయితే భారీ వర్షాల కారణంగా నదికి వరద పోటెత్తింది. బ్రిడ్జి కింద ఉన్న పునాది భాగం ఒక్కసారిగా కూలిపోయింది. వందలాది ప్రయాణికులతో ఓ రైలు బ్రిడ్జిపై ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనతో ఆ మార్గంలో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. బ్రిడ్జి కింద బేస్ కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.