థానేలో ధైర్య సాహసంతో ప్రాణాలు కాపాడుకున్న 16 ఏళ్ల విద్యార్థిని
థానే (మహారాష్ట్ర) :
కిడ్నాప్ యత్నం నుంచి 16 ఏళ్ల బాలిక అపూర్వ ధైర్యంతో బయటపడిన సంఘటన థానేలో కలకలం రేపుతోంది. స్కూల్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కిన బాలికను డ్రైవర్ మరో మార్గంగా తీసుకెళ్లగా, తన దగ్గరున్న జామెట్రీ కంపాస్‌తో అతనిపై దాడి చేసి, కదులుతున్న ఆటో నుంచే దూకి ప్రాణాలను కాపాడుకుంది.
పోలీసుల కథనం ప్రకారం… జూలై 9న భివండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్కూల్‌కి వెళ్లే బాలిక ఆటోలో ఎక్కిన వెంటనే డ్రైవర్ వేరే దారి తీసాడు. అనుమానం వచ్చిన బాలిక అతడిని నిలదీసినా లాభం లేకుండా పోయింది. వేగం పెంచుతూ ముందుకు దూసుకెళ్లిన డ్రైవర్‌పై బాలిక తీవ్రంగా స్పందించింది.
ఆత్మరక్షణలో భాగంగా… వెంట ఉన్న జామెట్రీ కంపాస్‌ను డ్రైవర్‌పై ప్రయోగించి, అతన్ని గందరగోళానికి గురిచేసింది. అనంతరం చాకచక్యంగా కదులుతున్న ఆటో నుంచి దూకి బయటపడింది. స్వల్ప గాయాలైనప్పటికీ ఆమె క్షేమంగా బయటపడింది.
తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చిన బాలిక, పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై పరిశీలన కొనసాగుతోంది.