ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్రంగా చర్చ
నాగ్‌పూర్ :
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. నేతలు 75 ఏళ్లకు రిటైర్ అవ్వాలని పేర్కొన్నారు. ‘మీకు 75 ఏళ్లు వస్తే.. ఇక ఆగిపోయి ఇతరులకు అవకాశం ఇవ్వాలి’ అని వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ పుస్తకావిష్కరణలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ని ఉద్దేశించే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ తీవ్రంగా చర్చ నడుస్తోంది.నాగ్‌పూర్‌లో దివంగత ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లీకి అంకితం చేసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మోహన్ భగవత్ ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో మోరోపంత్ పింగ్లీ మాటలను గుర్తు చేసుకున్నారు. ‘75 ఏళ్లు నిండిన తర్వాత మీకు శాలువాతో సత్కారం లభిస్తే దాని అర్థం మీరు ఇక ఆగిపోవాలని. పక్కకు తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాలి’ అంటూ గతంలో ఓ సారి మోరోపంత్ పింగ్లీ చేసిన వ్యాఖ్యలను మోహన్ భగవత్ ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి.ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని మోదీకి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించే మోహన్ భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు మాట్లాడుకుంటున్నారు. మోహన్ భగవత్ వ్యాఖ్యలపై శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, జస్వంత్ సింగ్ వంటి నాయకులను 75 ఏళ్లు దాటిన తర్వాత పదవీ విరమణ చేయమని ప్రధాని మోదీ బలవంతం చేశారు. ఇప్పుడు ఆయనకూ అదే నిబంధనను వర్తింపజేస్తారో లేదో చూడాలి’ అంటూ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.