భోపాల్ (మధ్యప్రదేశ్):
పనికి రాకుండా పదేళ్లు గడిపినా… జీతం మాత్రం నెలనెలా ఖాతాలోకి వస్తోంది! మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై అధికారులూ షాక్‌కు గురయ్యారు.
భోపాల్ పోలీస్ లైన్స్‌లో 2011లో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరిన వ్యక్తి… కొద్ది రోజులకే శిక్షణ నిమిత్తం సాగర్ పంపించాలన్న నిర్ణయం అధికారులు తీసుకున్నారు. కానీ వ్యక్తిగత కారణాలతో శిక్షణకూ వెళ్లకుండా, సర్వీస్ రికార్డు పోస్టు చేసి ఇంటికే వెళ్లిపోయాడు. అతని రికార్డులను సరిగా పరిశీలించకుండా అధికారులు ఆమోదించడం వల్ల… తర్వాతి పదేళ్లుగా ఎవరికీ అతని గైర్హాజరు విషయం పట్టించుకోలేదు.
ఇలా విధులకు హాజరుకాకుండానే నెలనెలా జీతం ఖాతాలో పడుతూ వచ్చింది. ఇప్పటివరకు సుమారుగా రూ.28 లక్షలు జమ అయినట్లు సమాచారం.
డీజీపీ ఉత్తర్వులతో దొరికిన అసలు కథ!
ఇటీవల డీజీపీ, 2011 బ్యాచ్‌కు పే గ్రేడ్ మదింపు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎక్కడ పనిచేస్తున్నాడో తెలియకపోవడంతో విచారణ ప్రారంభించగా… అతను శిక్షణకూ వెళ్లలేదని, విధులకు కూడా హాజరుకాలేదని తేలింది.
మానసిక సమస్యతో..!
నోటీసులకు స్పందించిన కానిస్టేబుల్, తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, అధికారులకు చెప్పలేకపోయానని వివరణ ఇచ్చాడు. కొన్ని మెడికల్ రిపోర్టులు కూడా సమర్పించాడు. ఇప్పటివరకు తీసుకున్న జీతంలో కొంత ప్రభుత్వానికి తిరిగి చెల్లించనున్నట్లు తెలిపాడు.
ఇప్పటికే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించిన అధికారులు… నివేదిక వచ్చిన తర్వాత బాధ్యత వహించాల్సిన అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.