అసలు మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేమూ చూస్తాం ..

Facebook
X
LinkedIn

      డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్

అమరావతి :

వైసీపీ నాయకులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2029లో అధికారంలోకి వస్తే కూటమి నాయకుల అంతుచూస్తామని వైసీపీ నాయకులు అంటున్నారని ఆయన ప్రస్తావించారు. అసలు మీరు అధికారంలోకి రావాలి కదా.. మీరు అధికారంలోకి ఎలా వస్తారో మేమూ చూస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా నరసింహపురంలో తాగునీటి పథకానికి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా కూటమి పార్టీల మధ్య విబేధాలపై పవన్ కల్యాణ్ స్పందించారు. కూటమిలో తనకు, చంద్రబాబుకు మధ్య స్పష్టత ఉందని తెలిపారు. ఎవరి పాత్ర ఏంటనేది తమకు స్పష్టంగా తెలుసని అన్నారు. కూటమిలో కొన్ని విబేధాలు ఉంటే ఉండొచ్చని.. నాయకులు తిట్టుకుంటూ పొడుచుకుంటూ ఉండకూడదని సూచించారు. తమపై ఎంతో నమ్మకంతో ఏపీ ప్రజలు బాధ్యత పెట్టారని తెలిపారు. కూటమిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని అన్నారు. ఒకరిని ఒకరు గౌరవించుకోవాలని సూచించారు. తామూ ఏ పార్టీని తగ్గించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. అన్ని వేళ్లు ఒకలా ఉండవని.. కానీ అన్ని వేళ్లూ కలిస్తేనే పిడికిలి అని తెలిపారు.వ్యక్తిగతంగా తనకు ఎవరిపై కక్ష ఉండదని పవన్ కల్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వం జల జీవన్ మిషన్‌ను పట్టించుకోలేదని అన్నారు. రౌడీయిజం, గూండాయిజంతో భయపెట్టి వేధించారని ఆరోపించారు. మంచినీటిని అందించాలన్న ధ్యాస కూడా గత పాలకులకు లేదని విరుచుకుపడ్డారు. గత పాలకులు లక్షల కోట్లు అప్పులు పెడితే వాటన్నింటినీ తట్టుకుని ఇవాళ ముందుకెళ్తున్నామని చెప్పారు. వైసీపీ హయాంలో ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా వాటిని దోచేశారని ఆరోపించారు. ఆక్రమణకు గురైన ఆలయ భూములను తిరిగి వెనక్కి తీసుకునే ప్రక్రియ ప్రారంభించామని, వాటికి రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని స్పష్టం చేశారు.