న్యూ డిల్లీ ;
సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొన్ని దేశాలు (పరోక్షంగా పాక్‌ను ఉద్దేశిస్తూ) సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా ఉపయోగిస్తున్నాయంటూ చైనా గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగారు. తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు.చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సమావేశంలో ఇటీవలే పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి రాజ్‌నాథ్ మాట్లాడారు. దీనికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ గురించి కూడా వివరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం భారత్ హక్కు అంటూ కుండ బద్దలు కొట్టారు.‘కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన పరికరంగా మలుచుకున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నాయి. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. అటువంటి దేశాల చర్యలను ఏ మాత్రం ఊపేక్షించకూడదు. అలాంటి వాటిని ఎస్సీఓ ఖండించాలి. శాంతి, ఉగ్రవాదం ఎప్పటికీ కలిసి ఉండలేవు. విధ్వంసాలకు కారణమయ్యే ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లో ఉండకూడదు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మకమైన చర్య అవసరం. దుష్టశక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఐక్యం కావాలి’ అంటూ ఆయా సభ్య దేశాలకు రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు.