తెలుగునాడు, న్యూఢిల్లీ :
గడిచిన నాలుగు రోజులుగా భారత సైన్యం సామర్థ్యాన్ని చూస్తున్నాం.. నిఘా వర్గాల సామర్థ్యం, శాస్త్ర సాంకేతిక సామర్థ్యాన్ని దేశం చూసింది.. మన దేశం అసమాన వీరత్వాన్ని ప్రదర్శించింది.. భారత రక్షణ దళాలు చూపిన ధైర్య సాహసాలు దేశానికి తలమానికం అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత జాతిని ఉద్దేశించి ఢిల్లీ నుంచి మోదీ మాట్లాడారు.పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ కుటుంబ సభ్యుల ముందు కాల్చిచంపారు. పహల్గాం ఉగ్రదాడితో దేశమంతా నివ్వెరపోయింది. ఉగ్రవాద దాడులపై ప్రతి హృదయం జ్వలించిపోయింది. పౌరులు, పార్టీలు అన్ని ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాయి అని మోదీ తెలిపారు.సైన్యం, సాహసం, పరాక్రమాన్ని దేశం చూసింది. భారతీయ మహిళల నుదుటిపై సిందూరం తుడిచేసిన వారికి ఎలాంటి బుద్ధి చెప్పాలో అదే ఆపరేషన్ సిందూర్.. ఆపరేషన్ సిందూర్ ఒక పేరు కాదు.. ఒక ఆవేదన. ఆపరేషన్ సిందూర్ న్యాయం కోసం చేసిన ఓ ప్రతిజ్ఞ. ఈ నెల ఏడో తేదీ తెల్లవాజుమన ఈ ప్రతిజ్ఞ నెరవేరడం ప్రపంచమంతా చూసింది అని మోదీ పేర్కొన్నారు.