తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్
న్యూఢిల్లీ :
ఉగ్రవాదంపై భారత్ వైఖరి మారదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. భవిష్యత్తులోనూ ఉగ్రవాదంపై దృఢంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. అమెరికా మధ్యవర్తిత్వంతో జరిగిన కాల్పుల విరమణను ఆయన ప్రస్తావించారు. అన్ని సైనిక చర్యలను నిలిపివేయడానికి భారత్, పాకిస్థాన్ ఒక అవగాహనకు వచ్చాయని ఎస్ జైశంకర్ తెలిపారు. అలాగే ఉగ్రవాదంపై వైఖరికి భారత్ రాజీపడబోదని అన్నారు. ‘భారత్, పాకిస్థాన్ దేశాలు కాల్పుల విమరణ, సైనిక చర్యపై ఒక అవగాహన కుదుర్చుకున్నాయి. అన్ని రూపాలు, వ్యక్తీకరణలలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన, రాజీలేని వైఖరిని భారత్ నిరంతరం కొనసాగిస్తుంది. ఇది అలాగే కొనసాగుతుంది’ అని ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ చేపట్టిన సైనిక చర్యల వల్ల గత కొన్ని రోజులుగా భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. అయితే పాక్ మిలిటరీ సంప్రదింపుల కారణంగా కాల్పుల విరమణకు భారత్ అంగీకరించిందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని వెల్లడించారు.