తెలుగునాడు, హైదరాబాద్ :
తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ సరిహద్దులను కాపాడుతూ, ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో వీరోచితంగా పోరాడుతున్న భారత సాయుధ దళాలకు మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో స్ఫూర్తిదాయక చర్యకు శ్రీకారం చుట్టారు. భారత సాయుధ బలగాలకు సహకారంగా తన ఒక నెల వేతనాన్ని జాతీయ రక్షణ నిధి (National Defence Fund) కి విరాళంగా అందజేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
“మన దేశ ధీర సాయుధ దళాలు ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు, మన సరిహద్దులను, ప్రజలను రక్షించేందుకు ప్రాణాలను పణంగా పెట్టి అందిస్తున్న అసమాన సేవలకు చిన్న సహకారంగా, ఒక భారతీయుడిగా నేను నా ఒక నెల జీతాన్ని జాతీయ రక్షణ నిధి (National Defence Fund) కి విరాళంగా అందిస్తున్నాను.
ఈ పవిత్ర లక్ష్యంలో భాగస్వాములు కావాలని నా సహచరులు, పార్టీ నాయకులతో పాటు ప్రతి ఒక్క భారతీయుడిని ఆహ్వానిస్తున్నాను. మన సాయుధ దళాలకు అండగా నిలుద్దాం. విజయం మన సొంతం! జై హింద్!” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.