తెలుగునాడు, న్యూ డిల్లీ :
పాకిస్తాన్, పీవోకేలోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు మద్దతు ప్రకటించారు. అవసరమైతే జోక్యం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు. ఇరుదేశాలు ఉద్రిక్తతలు తగ్గిస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్-పాక్‌ల దాడులు దాడులు భయంకరంగా ఉన్నాయన్నారు. తనకు రెండుదేశాలతో మంచి సంబంధాలున్నాయని.. తనకు వారి గురించి బాగా తెలుసునన్నారు. ఇద్దరు శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకొని దాడులను ఆపాలని తాను కోరుకుంటున్నారన్నారు. తక్షణం దాడులను ఆపుతారని ఆశిస్తున్నట్లు చెప్పారు. రెండుదేశాలు పరస్పరం దెబ్బతీసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తాను ఏదైనా సహాయం చేయగలిగితే అందుబాటులో ఉంటానన్నారు.ఇంతకు ముందు భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ స్పందిస్తూ ‘ఇది త్వరగా ముగియాలని ఆశిస్తున్నాను. ఇది మంచిది కాదు.. మేం ఒవల్ ఆఫీస్‌లోకి అడుగుపెడుతున్నపుడే ఈ విషయం తెలిసింది. కొంతమంది ఇలాంటి దాడి జరిగే అవకాశం ఉందని ఊహించారు. వీరు శతాబ్దాలుగా ఒకరిపై ఒకరు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పుడు అయినా ఇది ముగిసిపోవాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఉగ్రమూకలకు చెందిన తొమ్మిది కీలక ప్రదేశాలపై భారత త్రివిధ దళాలు సంయుక్తంగా విరుచుకుపడ్డాయి.దాదాపు 25 నిమిషాల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌లో లష్కరే తోయిబా జైషే మొహమ్మద్ ), హిజ్బుల్ ముజాహిదీన్ తదితర గ్రూపులకు చెందిన స్థావరాలపై మిస్సైల్స్‌తో దాడి చేసింది. దాడుల తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రపంచంలోని కీలక మిత్రదేశాలతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టడానికి గల కారణాలను వివరించారు. అమెరికా ఎన్ఎస్ఏ మార్కో రూబియో, యూకే జోనాథన్ పావెల్, సౌదీ అరేబియాకు చెందిన ముసైద్ అల్ ఐబాన్, యూఏఈకి చెందిన షేక్ తహ్నూన్ బిన్ జాయెద్, అలీ అల్ షంసి, రష్యాకి చెందిన సెర్గీ షోయిగు, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ బోన్, జపాన్‌కు చెందిన మసటకా ఒకానోతో మాట్లాడారు. అలాగే, విదేశాంగ మంత్రి జైశంకర్ సైతం జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ విదేశాంగ మంత్రులతో చర్చలు జరిపారు.