రీజనల్ రింగ్ రోడ్ కి నిధులు కేటాయించండి : సీఎం రేవంత్ రెడ్డి

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్ :


రీజినల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగానికి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిన నేపథ్యంలో, వీలైనంత త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం ఇవ్వాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలను ఏకకాలంలో పూర్తి చేసేందుకు కేంద్రం సహకరించాలని కోరారు.
హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర మంత్రి గడ్కరీ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్), రేడియల్ రోడ్ల నిర్మాణంపై చర్చించారు. ఓఆర్ఆర్, ఆర్‌ఆర్‌ఆర్‌లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించారు.
జాతీయ రహదారి (ఎన్‌హెచ్-765)లోని హైదరాబాద్ – శ్రీశైలం సెక్షన్‌లో మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని సీఎం కోరారు. అలాగే, హైదరాబాద్ – అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను వీలైనంత త్వరగా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ – డిండి – మన్ననూర్, హైదరాబాద్ – మంచిర్యాల గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, ఓఆర్‌ఆర్ నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్ అభివృద్ధి పనులకు వెంటనే మంజూరు చేయాలని గడ్కరీ గారికి సీఎం విన్నవించారు.

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, ఎంపీలు డాక్టర్ లక్షణ్ , డాక్టర్ మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , హర్కర వేణుగోపాల్ , పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.