తెలుగునాడు, హైదరాబాద్ :
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ అల్ధాస్ జానయ్య సైఫాబాద్ కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో మీడియా సమావేశం నిర్వహించారు. దీనిలో “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం గురించి వివరించారు. దీన్ని ఒక సామాజిక ఉద్యమంగా చేపట్టానున్నామన్నారు. రైతులు, రైతు కూలీలు, ఉపాధ్యాయులు, అభ్యుదయ రైతులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే వ్యవసాయ విద్యా ప్రవేశాల్లో రైతు బిడ్డలకు 40 శాతం ప్రత్యేక కోటా ఉందని, ఈ కోటా నుంచి ఈ ఏడాది నుంచి రైతు కూలీల పిల్లలకు 15 శాతం కోటా సీట్లు ఇస్తామని జానయ్య వివరించారు. భవిష్యత్ తరాలకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తమ ప్రాంతాల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీ పాల్ రెడ్డి కోరారు. వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యం అవుతుందని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. కార్యక్రమ వివరాలను PJTAU డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్, ఈ కార్యక్రమ నోడల్ అధికారి డాక్టర్ చల్లా వేణుగోపాల్ రెడ్డి వివరించారు.
ఉపకులపతి అల్దాస్ జానయ్య మీడియా సమావేశపు సారాంశం ఈ క్రింది విధంగా ఉంది. తెలంగాణ రైతాంగానికి ప్రధానమైన సాగు సంబంధిత అంశాలపై అవగాహన కల్పించడానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTAU) నడుం బిగించింది.
దీనిలో భాగంగా “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” అనే వినూత్న కార్యక్రమాన్ని మే 5వ తేదీ (సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుంది.
జూన్ 13వ తేదీ వరకు రాష్ట్రంలోని సుమారు 1200 రెవిన్యూ గ్రామాల్లో 200 శాస్త్రవేత్తల బృందాలు పర్యటించనున్నాయి.
దక్షిణ వ్యవసాయ మండలంలో సుమారు 100 శాస్త్రవేత్తల బృందాలు, ఉత్తర, మధ్య తెలంగాణ మండలాల్లో సుమారు 50 చొప్పున శాస్త్రవేత్తల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నాయి.
పని దినాల్లో ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకూ ముందే ఎంపిక చేసుకున్న గ్రామంలోని రైతు వేదిక లేదా మరో ఇతర ప్రదేశంలో శాస్త్రవేత్తల బృందం రైతాంగంతో సమావేశం అవుతుంది.
ప్రతి బృందంలో ఇద్దరు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విద్యార్థులు, ఇతర స్థానిక ప్రభుత్వ శాఖల సిబ్బంది, అభ్యుదయ రైతులు పాల్గొంటారు. అదేవిధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేస్తారు.
యూరియా వాడకం తగ్గించడం, అవసరమైన మేరకే రసాయనాలని వినియోగించి నేలసారాన్ని పరిరక్షించడం, సాగు నీటి సమర్థ వినియోగం, పంటల మార్పిడి, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ తదితర ముఖ్యమైన అంశాల్లో శాస్త్రవేత్తల బృందం రైతాంగానికి అవగాహన కల్పించనుంది.
ఈ కార్యక్రమ నిర్వహణలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్ లు, వ్యవసాయ పరిశోధన సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు పూర్తి భాగస్వాములవుతాయి.
విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు, సహ పరిశోధనా సంచాలకులు, కళాశాలల డీన్లు ఈ కార్యక్రమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం ద్వారా శాస్త్రవేత్తలు, విద్యార్థులకి క్షేత్రస్థాయిలో అన్నదాతలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
అదేవిధంగా అటు రైతాంగానికి అనేక ప్రధాన సాగు అంశాలపై శాస్త్రవేత్తల ద్వారా సాగు మెళకువలు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంల పై అవగాహన పెంచుకోవడానికి వీలు అవుతుంది. అందరమూ సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం.