ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయలేం : తెలంగాణ హైకోర్టు

Facebook
X
LinkedIn

తెలుగునాడు, హైదరాబాద్‌ :

ఐపీఎస్‌ల పిటిషన్లపై విచారణను తెలంగాణ హైకోర్టు ముగించింది. భూదాన్‌ భూములను నిషేధిత జాబితాలో ఉంచాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించింది. సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులపై అదే బెంచ్‌లో వెకేట్‌ పిటిషన్‌ వేసుకోవచ్చని పేర్కొంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నంబర్‌ 194లో పలువురు ఐపీఎస్‌ అధికారులు భూములు కొనుగోలు చేశారు. ఇవి భూదాన్‌ భూముని.. కొనుగోలులో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై ఈ నెల 24న విచారణ చేపట్టిన న్యాయస్థానం 27 మంది అధికారులకు చెందిన భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని ఆదేశించింది. అవి భూదాన్‌ భూములే అని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ భాస్కర్‌రెడ్డి సింగిల్ బెంచ్‌ ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ తాజాగా కొందరు ఐపీఎస్‌ అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. వీరిలో రవిగుప్తా, మహేశ్‌ భగవత్‌, శిఖా గోయల్‌, తరుణ్‌ జోషి, రాహుల్‌ హెగ్డె, స్వాతి లక్రా, సౌమ్యా మిశ్రా ఉన్నారు. ఆ భూములు భూదాన్‌వి కాదని, పట్టా భూములేనంటూ ఆ ఐపీఎస్‌ అధికారులు హైకోర్టుకు నివేదించారు. సర్వే నంబరు 194లో 16, 20, 18 గుంటల విస్తీర్ణాలతో కొనుగోలు చేశామన్నారు. దీనికి సంబంధించిన విక్రయ ఒప్పందపత్రాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈక్రమంలో బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయడానికి నిరాకరించింది