తెలుగునాడు హైదరాబాద్ :
తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం నూటికి నూరు శాతం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సంఘ సంస్కర్త బసవన్న గారి స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం కార్యక్రమాలను అమలు చేస్తోందని చెప్పారు.
శ్రీ మహాత్మ బసవేశ్వర 892వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ..

“సమాజంలో మార్పుల కోసం 12 వ శతాబ్దంలోనే పునాదులు వేసిన గొప్ప సంఘ సంస్కర్త బసవన్న. కుల, మత, లింగ వివక్షల వంటి సమాజ అవలక్షణాలను తొలగించాలని, సమ సమాజాన్ని నిర్మించాలని బసవన్న గారు ఎనలేని కృషి చేశారు. సమాజంలో బసవన్న గారు, జ్యోతిరావు ఫూలే గారు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారిలాంటి వారు ప్రతి మనిషికి సమానమైన హక్కులు కల్పించి గౌరవంగా బతకాలని కోరుకున్నారు.
ప్రతి మనిషి గౌరవంగా బతకడానికి అవసరమైన ప్రణాళికలను రచిస్తూ ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లాలి. ప్రజా ప్రభుత్వం ఆ కోవలోనే బాధ్యతతో ప్రజల దగ్గరికెళ్లి సమస్యలు తెలుసుకుని హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తోంది.
దేశంలోనే తొలి రాష్ట్రంగా తెలంగాణలో బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేశాం. వీటన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తాం. అందుకు అందరి నుంచి సంపూర్ణమైన మద్దతు ఉండాలి.
నిరుపేదలకు సన్నబియ్యం, ఆడబిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం, పేదవారికి ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రూ. 500 లకే సిలిండర్ అందివ్వడంతో పాటు 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చాం. రాష్ట్రానికి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. హైదరాబాద్ నగరాన్ని విస్తరించడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.
బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలు కాపాడాలి. ప్రజలు మెచ్చే విధంగా పరిపాలన అందించాలి. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి. బసవేశ్వరుడి స్పూర్తితో నడుస్తున్న ఈ ప్రభుత్వం, భవిష్యత్తులోనూ అదే మార్గంలో నడుస్తుంది.
వీరశైవ లింగాయత్ ల సంక్షేమం, అభివృద్ధి కోసం వారిచ్చిన విజ్ఞాపనలను పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేను మాట ఇచ్చానంటే నూటికి నూరు శాతం అమలు చేస్తా. రాబోయే పదేళ్ల పాటు తెలంగాణ ప్రజలకు జనరంజకమైన పరిపాలన అందిస్తాం.
ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు విద్యార్థినీ విద్యార్థులే వారధులుగా ముందుండి గ్రామాల్లో ప్రజలకు చేరవేయాలి. విద్యార్థుల భవిష్యత్తు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తా” అని ముఖ్యమంత్రి చెప్పారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.