జమ్ముకశ్మీర్​లో పర్యటకులపై ఉగ్రదాడి- 27 మంది మృతి

Facebook
X
LinkedIn

జమ్ముకశ్మీర్​లో పర్యటకులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు – 27 మంది మృతి- పదుల సంఖ్యలో క్షతగాత్రులు

తెలుగునాడు, :

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 27 మంది పర్యాటకులు మృతి చెందారు. పదుల సంఖ్యలో పర్యాటకులు గాయపడ్డారు. మృతుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న భద్రతాదళాలు ఘాతుకానికి ఒడిగట్టిన ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టాయి. ప్రధాని మోదీ సూచన మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా శ్రీనగర్‌కు పయనమయ్యారు.

అమర్​నాథ్ యాత్రకు ముందు ఉగ్రదాడి : అమర్‌నాథ్‌ యాత్రకు పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పొడవైన పచ్చికబయళ్లతో ఆహ్లాదకర వాతావరణంతో మినీ స్విట్జర్లాండ్‌గా పేర్కొందిన పహల్గామ్‌లో కాల్పులకు తెగబడ్డారు. బైసరన్ లోయలోని పర్వతం పైనుంచి దిగివచ్చిన పర్యాటకులను ఉగ్రవాదులు చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని చెప్పారు. గాయపడినవారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్‌ను రంగంలోకి దించారు. ఈ ప్రాంతానికి కాలినడక లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 38రోజులపాటు కొనసాగే అమర్ నాథ్ యాత్ర జులై 3నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు రెండు మార్గాల్లో అమర్‌నాథ్‌ హిమలింగం దర్శనానికి వెళ్తుంటారు. ఒకటి అనంత్ నాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48కిలోమీటర్ల దూరం ఉండగా, గందర్బల్ జిల్లా బాల్తాల్‌ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

అమిత్​షాతో ఫోన్​లో మాట్లాడిన మోదీ : సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఫోన్లో మాట్లాడారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనాస్థలాన్ని సందర్శించాలని కేంద్రమంత్రికి సూచించారు. దీంతో ఆయన శ్రీనగర్‌కు పయనమయ్యారు. భద్రతా సంస్థలతో సమావేశమై శాంతిభద్రతలను సమీక్షించనున్నారు. జమ్ముకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా రాంబన్‌ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకొని శ్రీనగర్‌కు చేరుకున్నారు. అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. ఉగ్రదాడిని జమ్ముకశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిని పిరికిపందల చర్యగా అభివర్ణించారు. దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.