1990వ దశకంలో క్రికెట్లో వరుసగా డబుల్ సెంచరీలు సాధించడమంటే సామాన్యం కాదు. అలా సాధించిన ఓ ఆటగాడు కేవలం మూడేళ్లలోనే టెస్ట్క్రికెట్ నుంచి అదృశ్యమైపోయాడు. అతడే వినోద్ కాంబ్లీ.. ఈ ముంబయి సంచలనం క్రికెట్ కెరీర్ తారాజువ్వలా ఎగసినా.. చివరికి నేలరాలింది.

By Sports News Team Published : 09 Dec 2024 16:46 IST

Vinod Kambli ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముంబయిలో ప్రముఖ కోచ్ దివంగత రమాకాంత్ ఆచ్రేకర్ విగ్రహావిష్కరణలో ఓ దృశ్యం అందరి మనసుల్ని కలచివేసింది. ఒకప్పుడు బ్రయాన్ లారాతో విశ్లేషకులు పోల్చిన ఆటగాడు వినోద్ కాంబ్లి (Vinod Kambli) తన మిత్రుడు సచిన్ తెందూల్కర్‌ను (sachin tendulkar) పట్టుకొని మాట్లాడుతున్న దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. అతడికి సాయం చేయడానికి 1983 జట్టులోని కపిల్‌దేవ్, గావస్కర్ వంటి మాజీ ఆటగాళ్లు ముందు కొచ్చారు. అసలు కాంబ్లి ఎందుకిలా అయిపోయాడు.. క్రికెట్ ఓ ధ్రువతారగా నిలవాల్సివాడి జీవితం ఇలా ఎందుకైపోయింది..?
సాధారణ కుటుంబం నుంచి అసాధారణ ప్రతిభ..
1972 జనవరి 18న ముంబయిలో కంజర్మార్గ్లోని ఓ సాధారణ కుటుంబంలో వినోద్ కాంబ్లి జన్మించాడు. చాలా మంది పిల్లల్లానే క్రికెటే జీవితంగా బాల్యం గడిచింది. ఎడమచేతి వాటం బ్యాటింగ్ అలవాటైంది. 1988లో శారదాశ్రమ్ విద్యామందిర్ తరఫున తన బాల్యమిత్రుడు సచిన్ తెందూల్కర్‌తో కలిసి 664 రికార్డ్ బ్రేకింగ్ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆ భాగస్వామ్యంలో అతడే 349 పరుగులు సాధించాడు. చాలా ఏళ్లు స్కూల్ క్రికెట్ చరిత్రలో అదే టాప్ పార్టనర్‌షిప్‌గా నిలిచింది. కాంబ్లి స్టైలిష్‌గా.. ఏదీ పట్టించుకోకుండా ఉండేవాడు. మరోవైపు సచిన్ కామ్‌గా.. క్రమశిక్షణగా ఉండేవాడు. ముంబయి క్రికెట్ సర్కిల్స్‌లో ఈ జంట హాట్‌టాపిక్‌గా మారింది.
టెస్ట్ క్రికెట్లో పెనుసంచలనం..
కాంబ్లి 1991లో షార్జాలో పాక్‌పై వన్డేతో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. చాలా దూకుడైన ఆటతీరుతో ఆకట్టుకొన్నాడు. టెస్టుల్లో మాత్రం 1993లో ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌తో మొదలుపెట్టాడు. ఆ సిరీస్‌లో ముంబయిలో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 224 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 227 పరుగులు సాధించి ప్రకంపనలు సృష్టించాడు. ఆ ఏడాది బ్యాటింగ్ సగటు 100ను దాటేసింది. అదే ఏడాది అత్యంత వేగంగా 1,000 పరుగులు పూర్తి చేశాడు. మూడు దేశాలపై వరుసగా శతాకలు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. స్పిన్ బౌలింగ్‌పై నిర్భయంగా విరుచుకుపడతాడనే పేరు తెచ్చుకొన్నాడు. కానీ, వెస్టిండీస్ పర్యటనలో ఫాస్ట్‌బౌలింగ్, షార్ట్‌పిచ్ బంతులను ఎదుర్కోవడంలో కాంబ్లి అవస్థలు పడ్డాడు. దీనిని విండీస్ బౌలర్లు బాగా వాడుకొన్నారు. మొత్తం 17 టెస్ట్‌లు ఆడిన అతడు 54.20 సగటుతో 1084 పరుగులు చేశాడు. 1995లో సుదీర్ఘఫార్మాట్ చివరి మ్యాచ్ ఆడాడు. అప్పటికి అతడి వయస్సు 23 ఏళ్లే..! అప్పటికే మైదానం బయట అతడి ప్రవర్తన, వివాదాలు తలనొప్పులుగా మారాయి.
మరోవైపు వన్డేల్లో కూడా కాంబ్లి 1992లో పుట్టిన రోజునాడు ఇంగ్లాండ్‌పై శతకం సాధించాడు. ఇక 1996 ప్రపంచకప్‌లో కూడా జింబాబ్వేపై సెంచరీ నమోదు చేశాడు. ఆ టోర్నీ సెమీస్‌లో ప్రేక్షకుల అల్లరి కారణంగా మ్యాచ్‌లో శ్రీలంకను విజేతగా ప్రకటించారు. అప్పటి క్రీజులో ఉన్న కాంబ్లీ కన్నీటితో పెవిలియన్‌కు చేరడం అభిమానులకు గుర్తుండిపోతుంది. ఆ తర్వాత మూడేళ్లపాటు పెద్దగా పరుగులు సాధించలేకపోయాడు. దీనికి తోడు గాయాలు, జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోవడం వంటి అంశాలు అతడి కెరీర్‌పై ఒత్తిడి పెంచాయి. జట్టులో పలు మార్లు స్థానం దక్కించుకొన్నా పరుగులు సాధించి నిలబెట్టుకోలేకపోయాడు. మరోవైపు గంగూలీ, ద్రవిడ్ ఆటగాళ్లు మిడిల్ ఆర్డర్లో బలంగా తమను తాము అవిష్కరించుకొన్నారు. దీంతో 2000 సంవత్సరంలో చివరి వన్డే ఆడాడు. 2011లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్ నుంచే వైదొలగాడు.
వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు..
కాంబ్లీ వైవాహిక జీవితం సాఫీగా ఏమీ సాగలేదు. 1998లో నొయెల్లా లెవిస్‌ను వివాహం చేసుకొన్నాడు. కానీ, ఆ తర్వాత వారు విడిపోయారు. 2009లో ఆండ్రియా హెవిట్ట్ను వివాహమాడాడు. అప్పటికే అతడు తీవ్ర ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాల్లో ఉన్నాడు.
యాక్టింగ్.. కోచింగ్.. రాజకీయాలు..
రిటైర్మెంట్ తర్వాత కాంబ్లి వివిధ రంగాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకొన్నాడు. చాలా రియాల్టీ షోల్లో పాల్గొన్నాడు. కొన్ని సినిమాల్లో నటించాడు. పెద్దగా అదృష్టం కలిసిరాలేదు. 2009లో ముంబయిలో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచాడు. సొంతగా ఖేల్భారతీ స్పోర్ట్స్ అకాడమీ పేరిట సొంతంగా కోచింగ్ సెంటర్ ప్రారంభించాడు. ఆ తర్వాత సచిన్‌కు చెందిన గ్లోబల్ అకాడమీతో కలిసి పనిచేశాడు. అనుకొన్నంత సక్సెస్ కాలేకపోయాడు.
తీవ్ర అనారోగ్యంపాలు..
కాంబ్లీ ఆరోగ్యం పరంగా కూడా వేగంగా కుంగిపోయాడు. 2013లో అతడికి గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత 2024లో అతడు కనీసం నిలబడలేని స్థితిలోకి చేరాడు. దీనికి సంబంధించిన వీడియో ఫ్యాన్స్‌లో ఆందోళన పెంచింది. తాజాగా రమాకాంత్ ఆచ్రేకర్ కార్యక్రమంలో అతడిని చూసిన అభిమానుల మనసు కలుక్కుమంది.
ఒకప్పటి క్రికెట్ తరంలోని అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచుకొన్న వినోద్ కాంబ్లీ.. వృత్తిపరమైన క్రమశిక్షణ లోపం, గాయాలు, మైదానం బయట ఆకర్షణలు కెరీరన్ను దెబ్బతీశాయని చెబుతారు. దీనికి తోడు క్రికెట్లో వేగంగా చోటు చేసుకొంటున్న మార్పులు.. సరికొత్తగా పుట్టుకొస్తున్న ప్రమాణాలను అందుకోవడంలో విఫలం కావడంతో తొందరగా ఆటకు దూరమైనట్లు విశ్లేషకుల విశ్లేషణ.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.