అర్జీలు ఇచ్చి తమకు న్యాయం చేయాలంటూ విన్నపం
అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మెన్ డూండి రాకేష్
తెలుగునాడు, అమరావతి :
పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ఓ బాధితురాలు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ… తాను మాతా శిశుసంక్షేమ శాఖలో అంగన్ వాడీ హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్నానని.. తాను పనిచేస్తున్న స్కూల్ లో అంగన్ వాడీ టీచర్ కు ప్రమోషన్ రావడంతో ఆమె బదిలీపై వెళ్లిపోయిందని.. ఆ టీచర్ ఉద్యోగానికి తనకు అన్ని అర్హతలు ఉన్నా గత వైసీపీ ప్రభుత్వంలో సాక్షి విలేఖరి, వైసీపీ నేతలు కలిసి.. బీసీలు, మైనార్టీలకు దక్కే జాబును ఓసీకి మార్చి తనకు ఉద్యోగం రాకుండా చేశారని.. సాక్షి విలేఖరి తన భార్యకు ఆ ఉద్యోగాన్ని ఇప్పించుకున్నాడని.. దీనిపై పోరాడుతున్న తనను స్టేషన్ లో పెట్టి కొట్టించి కేసులు పెట్టారని.. తనకు న్యాయం చేయాలని నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ లకు అర్జీ ఇచ్చి వేడుకున్నారు.
బాపట్ల జిల్లా బల్లికురవ మండలం కొప్పెరపాలెం గ్రామానికి చెందిన కోడెల నాగమల్లేశ్వరి గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తన కూతురు పేరుమీద ఉన్న భూమిపై కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నా.. అమక్రంగా తమ చేలోకి ప్రవేశించి తమపై మేకల వెంకటరెడ్డి, నారాయణరెడ్డి, అతని భార్యలు కర్రలతో దాడి చేశారని.. దీనిపై పోలీసుకు ఫిర్యాదు చేస్తే అసలు పట్టించుకోలేదని.. దీంతో వారు చేలో వేసిన మినప పంటను పూర్తిగా నాశనం చేశారని.. దీని వల్ల తమకు 30 వేలు నష్టం వాటిల్లిందని.. దయ చేసి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన పిన్నెబోయిన రవణమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమకు పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో 3.52 సెంట్ల భూమి ఉందని.. ఆ భూమి తన పెద్ద కుమారుడి పేరున ఉన్నదని.. ఈ భూమిని గ్రామానికి చెందిన అంజి అనే వ్యక్తి కౌలుకు తీసుకొని.. కౌలు డబ్బులు అడితే.. తమను కొట్టి మీరు టీడీపీ వారని.. కౌలు ఇచ్చేది లేదని పొలంలోకి వస్తే చంపేస్తామని బెదరించారని.. పిన్నెల్లి అనిమిరెడ్డి తనను జుట్టపట్టుకొని రోడ్డులో ఇడ్చి కొట్టాడని.. వారిపై సీఐకి వెళ్లి చెబితే ఇంకోసారి పోలీస్ స్టేషన్ లోకి వస్తే తమపైనే తిరిగి చీటింగ్ కేసు పెడతామని బెదిరించాడని.. దీనిపై ఇప్పటికి ఎన్నో అర్జీలు పెట్టినా తమకు ఎక్కడా న్యాయం జరగలేదని.. దయ చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.• గుంటూరు జిల్లా పొన్నూరు మండలం గొళ్లమూడిపాడు గ్రామానికి చెందిన తుమ్మల పార్వతి గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గత పంచాయతీ పాలకులు మురుగుకాలువను నిర్మించి ఆ కాలువ గుండా పోయే నీటిని నిర్లక్ష్యంగా పొలాల్లోకి వదిలివేయడంతో పంటలు పండే భూములు చౌడుబారి పనికిరాకుండా పోతున్నాయని దయ చేసి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామానికి చెందిన పుల్లయ్య గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తనకు పాయకాపురంలోని రాధా రంగా నగర్ లో బిల్డింగ్ కలదని.. సదరు బిల్డింగ్ తాలుకా కాగితాలు గాంధీ కోఆపరేటీవ్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి రూ. 12 లక్షలు తీసుకొని తిరిగి మొత్తం చెల్లించాక కూడా.. బ్యాంకు వారు తమ ఇంట్లోకి వచ్చి అద్దెకు ఉన్నవారిని కులం పేరుతో తిట్టి సామాన్లు బయట పడేసిన బ్యాంక్ మేనేజర్ వారి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు.
శ్రీ సత్యసాయి జిల్లా గుదిబండ మండలం కోంకల్లు గ్రామానికి చెందిన H. హనుమేష్ గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గతంలో తమకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాన్ని వైసీపీ నేత అక్రమంగా ఆక్రమించుకొని తమను ఇబ్బంది పెడుతున్నాడని.. దీనిపై కలెక్టరేట్ లో అర్జీలు ఇచ్చినా పట్టించుకోవడంలేదని.. దయ చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.