కూటమి ప్రభుత్వానిది సుపరిపాలన
ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నామనే నమ్ముతున్నా
సంక్షేమంలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే సహించం
చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
నూజివీడు నియోజకర్గంపై ప్రత్యేక శ్రద్ధ
ఆగిరిపల్లి ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు
ఘనంగా పూలే జయంతి వేడుకలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం
తెలుగునాడు, అమరావతి :
రాష్ట్రంలో సుపరిపాలన అందించేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని, నాపైన ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాననే విశ్వాసం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి పదవి తనకు కొత్త కాదని, సమైక్యాంధ్రలో తాను చేసిన అభివృద్ధి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. తనకు వేరే ఆశలు లేవని, మీ ప్రేమాభిమానాలు ఉంటే చాలని అన్నారు. మీ ఇంటికి పెద్దకొడుకుగా ఉంటానని చెప్పినట్టే రుజువు చేస్తున్నానని చెప్పారు. శుక్రవారం ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం వడ్లమానులో జరిగిన మహాత్మ జ్యోతీరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో మాట్లాడారు.

చరిత్ర మరిచిపోలేని గొప్ప వ్యక్తి పూలే :
చరిత్రలో శాశ్వతంగా నిలిచేపోయే చాలా కొద్ది మంది వ్యక్తుల్లో జ్యోతిరావు పూలే ఒకరు. బడుగు బలహీనవర్గాల ఆరాధ్య దైవం ఆయన. 198 ఏళ్లయినా ఇంకా పూలే జయంతి జరుపుకుంటున్నామంటే అదే ఆయన మనకు ఇచ్చిన స్ఫూర్తి. స్త్రీ విద్యకు ఆ రోజుల్లోనే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. తన సతీమణిని ప్రోత్సహించి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా చేశారు. బాల్య వివాహాలు, సతీసహగమనాలకు వ్యతిరేకంగా పోరాడారు. రైతుల కష్టాలు తీర్చేందుకు కృషి చేశారు. అంబేద్కర్ సైతం ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడిచారంటే పూలే గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది ఎన్టీఆర్ :
పూలే బాటలోనే మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రాష్ట్రంలో మహిళా విద్యకు పెద్దపీట వేసి ఏకంగా మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించే వరకు బీసీలకు న్యాయం జరగలేదు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని మొదటగా గుర్తించింది ఎన్టీఆర్. రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేస్తున్న ఏకైక పార్టీ టీడీపీ. టీడీపీకి వెన్నుముక బీసీలు… బీసీలను ఆదరించే బాధ్యత టీడీపీది. తనతో సహా ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్… ఇలా అందరం బీసీల కోసం ఆలోచిస్తున్నాం… వారి కోసం పనిచేస్తున్నాం.

బీసీల రక్షణ బాధ్యత టీడీపీది :
అట్రాసిటీ యాక్ట్ ద్వారా ఎస్సీ, ఎస్టీలకు ఎలా అయితే రక్షణ కల్పిస్తున్నామో, త్వరలో బీసీల కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టాన్ని తీసుకువస్తాం. దీనిపై సబ్ కమటీ వేశాం. ఆ నివేదిక ఆధారంగా చట్టాన్ని రూపొందిస్తాం. స్థానిక సంస్థల్లో బీసీలకు మేం 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే, గత ప్రభుత్వ హయాంలో 24 శాతానికి తగ్గించారు. మేం మళ్లీ 34 శాతానికి మళ్లీ రిజర్వేషన్ పెంచుతాం. నామినేటెడ్ పోస్టుల్లో 33 శాతం బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తాం.
బీసీలకు ఎంతో చేశాం… ఇంకా చేస్తాం :
నాయి బ్రాహ్మిణ్ ఫెడరేషన్, ఎంబీసీ ఫెడరేషన్, బీసీలకు కార్పోరేషన్లు, బీసీ భవన్లు, బీసీలకు ప్రత్యేక ప్రణాళిక, బీసీ విద్యార్ధులకు రెసిడెన్షియల్ స్కూళ్లు, మత్య్యకార పిల్లల కోసం ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూళ్లు, విదేశాల్లో చదువుకునేలా రూ.15 లక్షలు ఒక్కో విద్యార్ధికి ఆర్ధిక సాయం, పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు కోచింగ్, అలాగే బీసీ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసింది టీడీపీ. డీఎస్సీకి ప్రిపేర్ అయ్యే అభ్యర్ధులకు ప్రతి జిల్లా నుంచి 220 మందికి కోచింగ్ అందిస్తాం. ఆదరణ-3ని తీసుకువస్తాం.

బీసీల ఆదాయం పెరిగేలా ప్రత్యేక కార్యక్రమాలు :
బీసీల కులవృత్తులు దెబ్బతిన్నాయి. వారి ఆదాయం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు తీసుకువస్తున్నాం. కల్లుగీత కార్మికులకు మద్యం షాపులు కేటాయిస్తున్నాం. నేతన్నలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. బీసీలకు సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునేందుకు 2 కిలోవాట్లకు రూ.80,000, 3 కిలోవాట్లకు రూ.98 వేలు ప్రత్యేకంగా సబ్సిడీ ఇస్తున్నాం. దేవాలయాల్లో పనిచేసే నాయిబ్రాహ్మిణ్లకు రూ.15,000 ఉన్న వేతనాన్ని రూ.25,000 వేలు చేశాం.
ఆగిరిపల్లిలోనూ అన్నా క్యాంటిన్ :
అందరి ఆకలి తీర్చేందుకు అన్నా క్యాంటిన్లు పెట్టాం. మీ గ్రామంలోనూ త్వరలోనే అన్నా క్యాంటిన్ పెడతాం. డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రికలు… లక్ష మంది మహిళల్ని పారిశ్రామిక వేత్తలు చేయాలనుకుంటున్నా. మా అమ్మ కష్టాలు ఎవరికీ కలుగకూడదని దీపం-2 పథకం కింద ఉచితంగా 3 సిలండర్లు ఏడాదికి ఇస్తున్నాం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ‘తల్లికి వందనం’ పథకం కింద రూ.15,000 చొప్పున ఇస్తాం. అన్నదాతలకు మే నెల నుంచి ఏడాది రూ. 20,000 ఇస్తాం. అలాగే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో పరిహారం ఇస్తాం. సంపద సృష్టించి సంక్షేమానికి ఖర్చు పెడతాం. అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం మరింత నష్టపోతుంది.
పార్థసారధికి అండగా ఉంటాను :
నూజివీడు నియోజవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే వరకు మంత్రి పార్థసారధికి అండగా ఉంటాను. నూజివీడులో జనాభావృద్ధి కూడా తగ్గుతోందని, ప్రతి దంపతులు కనీసం ఇద్దరు చొప్పున పిల్లల్ని కనాలి. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో కోర్టు వివాదాల్లో చిక్కుకుపోయింది. మేము ఆ వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేలా చూసి… ప్రాజెక్టు పూర్తి చేస్తాం.

స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవద్దు :
సోషల్ మీడియా నేరస్తులకు అడ్డాగా మారింది. సోషల్ మీడియా ద్వారా ఎవరి వ్యక్తిత్వ హననం చేసినా వాళ్లకు అదే చివరి రోజు అవుతుంది. పిల్లలను మంచి పౌరులుగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలి. తప్పు చేసిన వాళ్ల విషయంలో చంఢశాసనుడిగా ఉంటా.
వివేకానంద రెడ్డిది గుండెపోటు అని మొదట జరిగిన ప్రచారాన్ని నమ్మి మోసపోయా, తర్వాత తెలిసింది అది గొడ్డలి పోటు అని. తప్పుడు ప్రచారం చేసినా, తప్పుగా మాట్లాడినా చర్యలు తప్పవు. గత ప్రభుత్వ హయాంలో ఎవరూ స్వేచ్ఛగా తిరగలేదు. మా ప్రభుత్వంలో ఇచ్చిన స్వేచ్ఛను ఎవరూ దుర్వినియోగం చేసుకోకండి.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.