రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్‌గా.. రెవెన్యూ కార్యదర్శి ‘సంజయ్ మల్హోత్రా’ నియమితులయ్యారు. బుధవారం నుంచి మూడేళ్లపాటు ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్‌గా నియమితులైన సంజయ్ మల్హోత్రా.. రాజస్థాన్ కేడర్‌కు చెందిన 1990 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి. ఆయన కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసి, ప్రిన్స్‌టన్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ పట్టా పొందారు.
మల్హోత్రా తన 33 ఏళ్ల కెరీర్‌లో పవర్, ఫైనాన్స్, టాక్సేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, గనులు మొదలైన అనేక రంగాలలో పనిచేశారు. రెవెన్యూ కార్యదర్శిగా నియమించబడక ముందు ఆర్థిక సేవల శాఖలో కార్యదర్శిగా పనిచేశారు. ఆర్ధిక రంగంలో గొప్ప అనుభవం ఉన్న మల్హోత్రా ప్రత్యక్ష, పరోక్ష పన్నుల కోసం పన్ను విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
ప్రస్తుతం గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం డిసెంబర్ 10( మంగళవారం)తో ముగియనుంది. కాబట్టి డిసెంబర్ 11 నుంచి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు స్వీకరించనున్నారు.