వక్ఫ్ బోర్డు ఆస్తి 31,590 ఎకరాలు అన్యాక్రాంతం
నా శాయశక్తులా వక్ఫ్ బోర్డు ఆస్తులు కాపాడుతా
వక్ఫ్ బోర్డు లావాదేవీలన్నీ ఫిబ్రవరి 1 నుండి ఆన్ లైన్ లోనే నిర్వహణ
- రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్
తెలుగునాడు, విజయవాడ :
రాష్ట్రంలో ఉన్న 65,783 ఎకరాల వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడతామని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ తెలిపారు.. వన్ టౌన్ గల రాష్ట్ర వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు ఆస్తులు భగవంతుడి కోసం దాతలు ఇచ్చారని, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం మతానికి చెందిన పేదలకు, వితంతువులకు, అనాధలకు ఖర్చు చేస్తామే కాని ఇతరులు ఆక్రమించుకోవడానికి కుదరదన్నారు. వక్ప్ బోర్డు ఆస్తి అంటే దేవుడి ఆస్తి అని దానికి బోర్డు చైర్మన్, సభ్యులు ధర్మకర్తలుగా మాత్రమే ఉంటామని అంతేకాకుండా ఆ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడే బాధ్యత మా పై ఉందన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు భగవంతుని కోసం దాతలు ఇచ్చారన్నారు. మసీదులకు మా తాతలు ధర్మకర్తలుగా, ముతావల్లీలుగా వున్నారని, కాభట్టి మేము ఆ ఆస్తిని అమ్ముకోవచ్చు అన్న అపోహలో కొందరు వున్నారన్నారు, అది జరుగదు, జరగనియ్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల వెంకటేశ్వర స్వామిని భక్తితో చూసినట్టు వక్ఫ్ బోర్డు ఆస్తులను కూడా అలాగే చూస్తారని, ముఖ్యమంత్రి నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ముకానివ్వనని అంతేకాకుండా వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతానన్నారు.
ఎప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల అవసరాల కోసం వక్ఫ్ బోర్డు భూములను నష్ట పరిహారంగా తీసుకోవచ్చని, కాని ప్రైవేట్ వ్యక్తులకు అది వీలుకాదన్నారు. గతంలో 65,783 ఎకరాల భూమి మసీదులు, దర్గాలకు దానంగా ఇచ్చారన్నారు. ఇందులో 31,590 ఎకరాల భూములు ఆక్రమణ లో వున్నాయన్నారు. ఈ భూములను కొందరు తెలిసో, తెలియకో కొన్నారన్నారు. కొన్నవారు ప్రతి అంగుళం భూమిని వెనక్కి ఇవ్వాల్సిందేనన్నారు. వక్ఫ్ భూముల ఆక్రమణలపై సర్వే సంపూర్ణంగా జరగడం లేదన్నారు. ఇప్పటి వరకు జిల్లాల్లో 651 ఎకరాలపై 40 ఫిర్యాదులు వచ్చాయన్నారు. కలెక్టర్, ఎస్పీ లు ఈ ఫిర్యాదులపై దర్యాప్తు చేయాలని కోరుతున్నామన్నారు. జిల్లాల్లో వక్ఫ్ ఇన్ స్పెక్టర్లు చేయాల్సిన పనులను ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారన్నారు.
వక్ఫ్ బోర్డుకు వచ్చిన ఆదాయం ఆయా ప్రాంతాల్లోనే అభివృద్ధికి ఉపయోగిస్తామన్నారు. ఉదాహరణకు కొండవీటి దర్గా వద్ద 87 ఎకరాల వక్ఫ్ భూమి ఉండగా వాటిలో సగం ఆక్రమణలో ఉందన్నారు. వాటి పరిశీలనకు వెళ్లిన అధికారులపై ఆక్రమణల దారులు దాడి చేశారన్నారు. ప్రస్తుతం దాడి చేసినవాళ్లు జైల్లో వున్నారన్నారు. వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులు తక్కువ కు కొన్నారన్నారని, ఇదెక్కడి న్యాయమో తెలియటం లేదన్నారు. ఇది దేవుడి ఆస్తి అని అందరమూ ధర్మంగా ఉందామని పిలుపునిచ్చారు. దేవుడి ఆస్తి కాపాడి పేద ప్రజలకు మేలు చేయాలనే ఆశతో ఉన్నామన్నారు. ఫిబ్రవరి 1 నుండి వక్ఫ్ బోర్డు లావాదేవీలన్నీ ఆన్ లైన్ లో వుంటాయని, వచ్చే రెవెన్యూ కూడా పారదర్శకంగా ఆన్ లైన్ లోనే నిర్వహిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయం నుంచే సిబ్బంది జీత భత్యాలు చెల్లించాల్సి ఉందన్నారు.
ఇకపై నుంచి కమర్షియల్ భూములను ఖాళీగా వుంచమని, లీజ్‌కు ఇస్తామన్నారు. దానివల్ల వక్ఫ్ బోర్డుకు ఆధాయం వచ్చేటట్టు చేస్తామన్నారు. లీజ్ ను ముస్లిం లు మాత్రమే తీసుకోవాలన్న రూల్ ఏమీ లేదని, ఏ మతం వారైనా ఆ ఆస్తులను లీజుకు తీసుకోవచ్చన్నారు. వక్ఫ్ బోర్డు, ఇస్లాం సెక్యులర్ అని అన్నారు. మా తాత రాజు, నేను రాజు అంటే కుదరదని, ఆరోజులు పోయాయని, వాస్తవానికి దగ్గరగా ఉండాలన్నారు. ఏ మతానికి చెందినవారికైనా శక్తి సామర్థ్యం వుంటే వక్ఫ్ బోర్డు భూములు లీజుకు తీసుకోవచ్చన్నారు. ప్రధమ ప్రాధాన్యత అంటూ ఎవ్వరికీ వుండదన్నారు. కాని ప్రొహిబిటెడ్ పనులకు మాత్రం అంటే మద్యం షాపులకు అలాంటి వాటికి మాత్రం వక్ఫ్ బోర్డు ఆస్తులు లీజుకు ఇవ్వమన్నారు. లీజు ఆస్తులపై వచ్చే రెవెన్యూ మాత్రం ముస్లిం మతానికి చెందిన పేదలు, వితంతువులు, అనాధలకు మాత్రమే అందిస్తామన్నారు. పక్క రాష్ర్టాల నుంచి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు నిధులు తెచ్చుకుంటున్నాయని, అదేవిదంగా ఆంధ్రప్రదేశ్ కూడా తెచ్చుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మంచి చేయాలనే సంకల్పంతో ఉన్న వక్ఫ్ బోర్డుకు అందరూ సహకరించాలని కోరుతున్నానన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.