ఇంటర్నెట్ డెస్క్: జమిలి ఎన్నికల (Simultaneous polls)పై మరో ముందడుగు పడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో లేదంటే వచ్చే సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాల సమాచారం. ఆ తర్వాత దీనిని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సమర్పించిన నివేదికకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఒక దేశం-ఒకే ఎన్నికల విధానాన్ని అమలు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ సులభతరం అవుతుందని, తద్వారా వేగవంతమైన ఆర్థికవృద్ధికి దారితీస్తుందని కోవింద్ కమిటీ పేర్కొంది. అయితే, దీనికోసం పలు రాజ్యాంగ సవరణలను కమిటీ సిఫార్సు చేసింది.
జమిలి ఎన్నికల ప్రతిపాదనలపై రాజకీయ పార్టీలు, పౌర సమాజం నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 30కిపైగా పార్టీలు దీన్ని సమర్థించగా.. కాంగ్రెస్ సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదన ఆచరణాత్మకమైనది కాదని కాంగ్రెస్ పేర్కొంటోంది. తమ పార్టీ జమిలి ఎన్నికలకు మద్దతు ఇవ్వడం లేదని.. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే చెబుతున్నారు.