స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలబడతాం

Facebook
X
LinkedIn

పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోం : మంత్రి నారా లోకేష్

విశాఖపట్నం:

స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడతామని, పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోం అని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రూ.15వేల కోట్ల ప్యాకేజీతో విశాఖ ఉక్కును కాపాడుకున్నాం. తిరిగి ఉత్పత్తి కూడా ప్రారంభించాం. ఇలాంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ లో సోమవారం జరిగిన ప్రమాదం చాలా బాధాకరం. బెస్ట్ టెక్నాలజీ ఉన్న ప్లాంట్ ఇది. ప్రమాదం జరిగిన వెంటనే కలెక్టర్, సీపీ, హోంమంత్రి, స్థానిక ఎంపీ, పల్లా గారు వచ్చారు. సోమవారం రాత్రి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు స్వయంగా వచ్చి పరిస్థితులను సమీక్షించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కూడా వచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

ఈ రాత్రికే ముందుగా మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

నేను కేవలం చెక్ ఇవ్వడానికి రాలేదు. బాధిత కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేసింది. పర్మినెంట్ అయినా, కాంట్రాక్ట్ అయినా మృతుల కుటుంబాల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి గారు పెద్దమనసుతో హామీ ఇచ్చారు. గతంలో ఈవిధంగా ఎక్కడా జరగలేదు. అవసరమైతే దీనిని కేబినెట్ కు కూడా తీసుకెళ్తానని ఆయన చెప్పారు. తనదీ బాధ్యత అని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మాపై ఉంది. స్టీల్ ప్లాంట్ రూల్స్ ప్రకారం కొంతమందికి ఎక్కువ ఎక్స్ గ్రేషియా అందుతుంది. ఎంతుంటే అంత ఇవ్వాలి. ఇప్పటికే సీఎండీ చాలా స్పష్టంగా చెప్పారు. కుమార స్వామి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మొదటి విడత కింద మృతి చెందిన 8 కుటుంబాలకు ఈ రోజు రూ.25 లక్షలు పరిహారం అందజేస్తాం. దానితర్వాత రావాల్సిన ఎక్స్ గ్రేషియా, పీఎఫ్ నగదు, స్టీల్ ప్లాంట్ నుంచి రావాల్సింది కూడా మొత్తం కాలిక్యులేట్ చేసి ఆయా కుటుంబాల అకౌంట్ లో వేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. అంత్యక్రియల అనంతరం అందరం మరోసారి చర్చించి ఏం చేయాలో ఆలోచన చేస్తాం. బాధిత కుటుంబాల పిల్లలు సొంత కాళ్లపై నిలబడేలా చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపై ఉంది.

స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కమిటీ నివేదిక తర్వాత చర్యలు

గతంలో విశాఖ ఉక్కును ఎన్డీఏ ప్రభుత్వం ఏవిధంగా కలిసికట్టుగా కాపాడిందో అదేవిధంగా కార్మికుల కుటుంబాలకు మేం అండగా నిలబడతాం. ప్రమాదంపై ఇప్పటికే కమిటీని నియమించారు. ఉక్కుద్రవం పొంగడం కాకుండా పైనుంచి కక్కడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీనిపై క్షుణ్ణంగా పరిశీలన జరుగుతుంది. కమిటీ నివేదిక తర్వాత ఏం చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ రోజు క్షతగాత్రుల్లో ఒకరైన శ్రీనివాసరావును కలిశాను. విశాఖ ఉక్కును కాపాడాలని చెప్పారు.