మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా చారిత్రాత్మక అడుగు

Facebook
X
LinkedIn

మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు 553 టీజీఎస్ఆర్టీసీ బస్సుల అందచేత.

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం:

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

హైదరాబాద్ :

మహిళలు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగానే కాకుండా ఆస్తుల యజమానులు, వ్యాపారవేత్తలు, సంపద సృష్టికర్తలు, ఆర్థిక వ్యవస్థకు నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.

మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మండల మహిళా సమాఖ్యలు కొనుగోలు చేసిన 553 టీజీఎస్ఆర్టీసీ బస్సులను సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో సోమవారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీ సంఖ్యలో హాజరైన మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి, మహిళలు సమాజంలో సగం, ఆకాశంలో సగం అని పేర్కొంటూ అభివృద్ధి ఫలితాలలో కూడా వారికి సమాన భాగస్వామ్యం ఉండాలని అన్నారు.

మహిళలను రుణగ్రహీతల స్థాయి నుంచి ఆస్తుల యజమానుల స్థాయికి తీసుకువెళ్లే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 553 మండల మహిళా సమాఖ్యలు రూ.199.08 కోట్ల పెట్టుబడితో 553 బస్సులను కొనుగోలు చేసి టీజీఎస్ఆర్టీసీకి లీజుకు ఇచ్చాయని వెల్లడించారు.

ప్రతి బస్సుకు నెలకు రూ.69,468 అద్దె లభిస్తుండగా, మొత్తం 553 బస్సుల ద్వారా మహిళా సమాఖ్యలకు నెలకు సుమారు రూ.3.84 కోట్ల ఆదాయం సమకూరుతోందని తెలిపారు. ఇప్పటివరకు రూ.20.34 కోట్లకు పైగా అద్దె ఆదాయం మహిళా సమాఖ్యలకు అందినట్లు చెప్పారు.

ఈ బస్సులు కేవలం రవాణా వాహనాలు కావని, తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబనకు, ఆత్మవిశ్వాసానికి, యాజమాన్య హక్కులకు ప్రతీకలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సంక్షేమం నుంచి సంపద సృష్టి వైపు మహిళలను తీసుకువెళ్లే ఆర్థిక విప్లవానికి ఇవి చిహ్నాలుగా నిలుస్తాయని అన్నారు.

మహాలక్ష్మి పథకం అమలులో ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ఇప్పటివరకు 308 కోట్లకు పైగా మహిళా ప్రయాణాలు నమోదయ్యాయని, మహిళలు సుమారు రూ.10,696 కోట్ల ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని వెల్లడించారు.

రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహిళా సంఘాలను రవాణా, వ్యవసాయం, మార్కెటింగ్, ఆహార ప్రాసెసింగ్, సేవారంగం, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధన రంగాలలో భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు నవీన్ యాదవ్, శ్రీ గణేష్, మల్‌రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కలువ సుజాత గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు దాన కిషోర్, వికాస్ రాజ్, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్, సమాచార మరియు పౌరసంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ ఎం. హరీష్ ముకుంద్ రెడ్డి, టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, మహిళా సమాఖ్యల ప్రతినిధులు, అధికారులు , రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.