మహిళా శక్తి మహాసభకు సర్వం సిద్ధం

Facebook
X
LinkedIn

తెలంగాణ మహిళల ఆర్థిక సాధికారతకు మరో చారిత్రక మైలురాయి

మహిళా శక్తి మహాసభను విజయవంతం చేయాలని రాష్ట్ర మహిళలకు మంత్రులు సీతక్క ,పొన్నం ప్రభాకర్ పిలుపు

హైదరాబాద్ :

తెలంగాణ మహిళా సాధికారత చరిత్రలో మరో సువర్ణ అధ్యాయానికి హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదిక కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ నిర్వహిస్తున్న “మహిళా శక్తి మహాసభ”కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ భారీ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 25 వేల మంది మహిళలు హాజరు కానున్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఉపాధి విస్తరణ, వ్యాపారాభివృద్ధి, నిర్ణయాత్మక భాగస్వామ్యాన్ని లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లుగా అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఈ మహాసభ ప్రతీకగా నిలవనుంది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మహిళా సంఘాల బలోపేతం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, మహిళల ఆర్థికాభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఆయన సభలో వివరించనున్నారు. అదే వేదికపై మహిళా సంఘాలకు ప్రస్తుతం అందుతున్న రూ.5 లక్షల రుణ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

సభ సందర్భంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల కింద రూ.500 కోట్ల చెక్కులు, మహిళా సంఘాలు నిర్వహిస్తున్న ఆర్టీసీ అద్దె బస్సుల హైర్ చార్జీల కింద రూ.20.30 కోట్ల చెక్కులు పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా కొత్త బస్సుల కొనుగోలు కోసం టీజీఎస్‌ఆర్టీసీకి రూ.199 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు.

మహిళా సంఘాల భాగస్వామ్యంతో కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకిచ్చిన 553 బస్సులను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు. మహిళల ఆర్థిక భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ వినూత్న నమూనా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

అలాగే మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు ఇప్పటివరకు కలిగిన రూ.10,700 కోట్లకు పైగా ఆర్థిక ప్రయోజనాలను సభలో వివరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మహిళల జీవితాల్లో తీసుకొచ్చిన సానుకూల మార్పులను ప్రజలకు తెలియజేయనున్నారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మహిళలు తమ సంఘాలకు చెందిన సొంత బస్సుల్లో హైదరాబాద్‌కు చేరుకునేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. తెలంగాణ నలుమూలల నుంచి మహిళా శక్తి ఒకే వేదికపై సమీకృతం కానున్న ఈ మహాసభ, మహిళల ఆర్థిక ప్రగతి ప్రయాణంలో మరో చారిత్రక మైలురాయిగా నిలవనుంది.

సోమవారం సాయంత్రం పరేడ్ గ్రౌండ్‌లో సభ ఏర్పాట్లను మంత్రులు దనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సభను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మహిళల రాకపోకలు, తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే భాగస్వాములుగా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతం, ఆర్థిక స్వావలంబన, సూక్ష్మ వ్యాపారాల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపునకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి స్వయం సహాయక సంఘ సభ్యురాలు ఈ మహాసభలో భాగస్వామ్యం కావాలని, మహిళా ఐక్యత, ఆత్మవిశ్వాసం, ఆర్థిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పే ఈ చారిత్రక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.