హైదరాబాద్ :
రాష్ట్ర పోలీస్ శాఖ దేశంలోనే సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందంజలో నిలిచిందని, అయితే ఇటీవలి కాలంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీ వ్యవస్థలను పూర్తిస్థాయిలో వినియోగించకపోవడం, క్షేత్ర స్థాయిలో అమలులో లోపాలు ఉండటం వల్ల కొన్ని అంశాల్లో వెనుకబడిన పరిస్థితులు ఏర్పడ్డాయని రాష్ట్ర డీజీపీ సి పి ఆనంద్ అన్ని యూనిట్ అధికారులతో పాటు ఎస్హెచ్ఓ లతో డిజిపి కార్యాలయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక వనరులను సమర్థవంతంగా వినియోగించి, డేటా ఆధారిత పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
డీజీపీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి వివిధ పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ, టెక్నాలజీ అనేది కేవలం సాఫ్ట్‌వేర్‌ల అభివృద్ధితో మాత్రమే పరిమితం కాకుండా వాటిని సమర్థవంతంగా వినియోగించడం, సమాచార సవరణ, రియల్ టైమ్ డేటా నిర్వహణపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న డిజిటల్ పోలీసింగ్ అప్లికేషన్లు, టీజీ కాప్ యాప్స్, ఇతర సాంకేతిక వేదికల అభివృద్ధి, వాటి అమలులో ఎదురవుతున్న సవాళ్లు, క్షేత్ర స్థాయి సమస్యలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వ్యవస్థలను రూపొందించడం మాత్రమే కాకుండా వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం అత్యంత ముఖ్యమని తెలిపారు.
పోలీస్ శాఖలో టెక్నికల్ అంశాలపై నిరంతర అభివృద్ధి, పర్యవేక్షణ, అమలు కోసం ప్రత్యేక టెక్నికల్ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. ఈ బృందం ద్వారా సాంకేతిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారాలను వేగవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
ప్రతి డేటా ఫీల్డ్ స్థాయిలో రియల్ టైమ్‌లో అప్‌డేట్ అవుతూ ఉండాలని, వ్యవస్థల్లో నమోదయ్యే సమాచారం ఖచ్చితంగా, సమగ్రంగా ఉండాలని డీజీపీ సూచించారు. ప్రస్తుతం చేపట్టిన డిజిటల్ కార్యక్రమాల్లో సుమారు 60 శాతం వరకు మాత్రమే పురోగతి సాధించామని, అయితే ఆశించిన స్థాయిలో అమలు జరగలేదని తెలిపారు.
రియల్ టైమ్ ఇన్వెస్టిగేషన్‌లో డిజిటల్ ఫోరెన్సిక్స్, డిజిటల్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్, సాంకేతిక ఆధారిత దర్యాప్తు విధానాలను మరింత విస్తృతంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించడం ద్వారా దర్యాప్తు వేగవంతం కావడంతో పాటు నేర పరిశోధనల్లో నాణ్యత పెరుగుతుందని పేర్కొన్నారు.
సీసీటీఎన్‌ఎస్, ఎస్‌సీఆర్‌బీ రిపోర్టులు, ఎన్‌టీఆర్ ఫోటో డేటాబేస్‌తో పాటు ఇతర డిజిటల్ రికార్డులను నిరంతరం అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పలు అప్లికేషన్లు, ఫిట్‌నెస్ ఎగ్జామినేషన్ మాడ్యూల్స్, సీడీ పార్ట్ అవర్స్ వంటి వ్యవస్థలు పూర్తిస్థాయిలో వినియోగించబడటం లేదని అన్నారు.
ప్రత్యేకంగా ఎస్‌హెచ్‌ఓలు కేసులకు సంబంధించిన ప్రతి అంశాన్ని సమయానికి సిస్టమ్‌లో నమోదు చేయాలని సూచించారు. ఎఫ్‌ఐఆర్‌లు, క్రైమ్ వివరాలు, సీడీ పార్ట్స్, 41 సీఆర్‌పీసీ ప్రక్రియలు, అరెస్ట్ వివరాలు, ఫామ్-54, సైంటిఫిక్ ఎవిడెన్స్, చార్జ్‌షీట్లు వంటి అంశాలను నిర్దిష్ట సమయంలో అప్‌డేట్ చేయడం ద్వారా డేటా ఆధారిత పోలీసింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని తెలిపారు.
రియల్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్‌ను సమర్థవంతంగా వినియోగిస్తే క్రైమ్ అనాలిసిస్, మంత్లీ క్రైమ్ రివ్యూలు, ట్రెండ్ స్టడీస్, కేసుల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందని డీజీపీ పేర్కొన్నారు.
దేశంలో టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ కార్యక్రమాల్లో రాష్ట్ర పోలీస్ శాఖ గతంలో అనేక రంగాల్లో ముందంజలో నిలిచిందని, ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను సమర్థంగా అప్‌డేట్ చేసి క్షేత్రస్థాయిలో అమలు చేస్తే మళ్లీ దేశంలో అగ్రస్థానంలో నిలిచే అవకాశం ఉందని డీజీపీ స్పష్టం చేశారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అడిషనల్ డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, డీజీ టెక్నికల్ సర్వీసెస్ వి.వి. శ్రీనివాసరావు, డీజీ ఆర్గనైజేషన్ స్వాతి లక్రా తదితర ఉన్నతాధికారులు, జిల్లా పోలీస్ అధికారులు, సాంకేతిక విభాగ అధికారులతో పాటు వివిధ యూనిట్ల ప్రతినిధులు పాల్గొన్నారు.









Telugunadu.com is a dedicated Telugu news platform that delivers comprehensive coverage of events and developments in Andhra Pradesh and Telangana. The website serves as a reliable source for breaking news, regional updates, and political developments, with a particular focus on Telugu Desam Party activities. Telugunadu.com aims to keep its readers informed with accurate and timely updates on the two Telugu states.