తెలుగునాడు, హైదరాబాద్ :
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం స్ఫూర్తి గ్రూప్ ఆధ్వర్యంలో కమలానగర్ ఆఫీసులో సామాజిక ఉద్యమ నేత స్ఫూర్తి గ్రూపు నాయకులు స్వర్గీయ కుంపటి కృష్ణ ప్రసాద్ ప్రథమ వర్ధంతి సభ సందర్భంగా “సామాజిక న్యాయం ఎదుర్కొంటున్న సవాళ్లు” అంశంపై స్మారకోపన్యాస కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు ప్రసంగించారు. వర్ధంతి సభకు కొమ్ముల మల్లేశం ఎన్ ఎఫ్ సి సైంటిఫిక్ ఆఫీసర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నేత కోమటి రవి , కేకే ప్రసాద్ బాబు సతీమణి కోటేశ్వరి ప్రసంగించారు. స్ఫూర్తి గ్రూపు బాధ్యులు గొడుగు యాదగిరిరావు ఆహ్వానితులను వేదిక మీదికి ఆహ్వానించారు. కేకే ప్రసాద్ బాబు చిత్రపటానికి ముఖ్య అతిథులు స్కైలాబ్ బాబు, ప్రసాద్ బాబు గారి సతీమణి కోటేశ్వరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభ్యులందరూ కేకే ప్రసాద్ గారి చిత్రపటానికి పూలను వేసి జోహార్లు అర్పించారు. ప్రారంభ సూచికగా ప్రారంభగీతం గురజాడ రచించిన దేశభక్తి గీతాన్ని స్ఫూర్తి గ్రూపు నాయకులు రుక్కయ్య ఆలపించారు. నవ తెలంగాణ రవి, ప్రజానాట్యమండలి భాస్కర్ రాజ్యాంగ విశిష్టతను పాటలు పాడారు.

అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ ప్రసాద్ బాబు మాకందరికీ గురువుగా ప్రేరకుడిగా మమ్ములను నడిపించారని చెప్పారు. వారి అడుగుజాడల్లో మేమంతా నడిచి సామాజిక చైతన్యంతో ముందుకు సాగుతామని చెప్పారు. మొదటగా కోమటి రవి మాట్లాడుతూ ప్రసాద్ బాబు అట్టడుగు సామాజిక తరగతి నుండి వచ్చి కడు పేదరికంలో విద్యను డిప్లమా పూర్తి చేసి ఉద్యోగం సాధించారని చెప్పారు. ఆయన జీవితంలో అనేక విధాలుగా వివక్షను ఎదుర్కొన్నారని అయినా మొక్కవోని దీక్షతో పనిచేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ముఖ్యఅతిథి స్కైలాబ్ బాబు మాట్లాడుతూ ప్రసాద్ బాబు జీవితకాలం సామాజిక న్యాయానికై పోరాడారని చెప్పారు. నేడు సామాజిక న్యాయం అంటే ఆయా సామాజిక తరగతికి చెందిన వారిని అధికారంలో కూర్చోబెడితే చాలు అనే తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని అది సరికాదని అన్నారు. దానివల్ల ఆ వ్యక్తికి సంబంధించిన వారికి లాభం తప్ప ఆ సామాజిక తరగతులకు ఎటువంటి ప్రయోజనం లేదని రుజువువతుంది అని చెప్పారు. నేటి సమాజంలో సామాజిక న్యాయం పేరిట రాజకీయ పార్టీలు వింత వింత పోకడలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. మనువాదం వేల సంవత్సరాలు నిచ్చెన మెట్ల సంస్కృతిని ఏర్పర్చి అగ్రవర్ణాలకు ఊడిగం చేయించారని చెప్పారు. అదే సంస్కృతిని నేటికీ తిరిగి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. దానికి వ్యతిరేకంగా అంబేద్కర్ ఎంతో కృషి చేసి భారత రాజ్యాంగాన్ని ఇచ్చారని చెప్పారు. దానిని నేటి పాలకులు తుంగలో తొక్కి మనువాదాన్ని పునః ప్రతిష్టించాలని తప్పుడు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. సామాజిక న్యాయం ఉండాలంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి. కానీ నేటి పాలకులు వాటిని పూర్తిగా నాశనం చేసి ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు ఉండాలని తద్వారానే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. దీనికోసం ప్రసాద్ బాబు అహర్నిశలు కృషి చేశారు. వారి ఆశయ సాధనకు మనందరం గట్టిగా కృషి చేయాలని కోరారు. సేవా రంగంలో కృషి చేస్తున్న అబ్దుల్ రహీం, జయరాజు , ఎన్ఎఫ్సీ యాదగిరి , శివన్నారాయణ, వెంకట్, విద్యావేత్త రషీద్ ప్రసంగించారు. పూలే అంబేద్కర్ స్ఫూర్తి గ్రూపు బాధ్యులు గోవిందు వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.ఈ కార్యక్రమంలో శారద, రోజా రాణి, హరి ప్రసాద్, శ్రీనివాసరావు, శ్రీనివాసులు, శ్రీనివాస్, శ్రీమన్నారాయణ, బాలు, వెంకటసుబ్బయ్య, హెచ్ వి స్వామి, సాయప్ప, మల్లేశం, ఎన్ఎఫ్సీ మల్లేశం, లక్ష్మయ్య, నరసయ్య, జెన్నీ, నాగేష్, షేక్షావలి, మాధవి, పాష, వెంకట్, కృపా సాగర్, కృష్ణమాచార్యులు ఎన్ఎఫ్సీ యూనియన్ నాయకులు మురళీధర్, మహమ్మద్ యాకూబ్, రాకేష్, హనుమంతు, సిహెచ్ రాజు, ఏ అశోక్, బాలకృష్ణ,విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.